ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR), ఫారం-6లో మార్పులకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి విరుద్ధంగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే వాటిని కొట్టివేసే అధికారం కోర్టుకు ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈసీ నిర్ణయాలు చట్ట ప్రకారం ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
‘ఫారం-6 మార్పులను ఆమోదించలేదు’
SIR సందర్భంగా ఉపయోగిస్తున్న ఫారం-6లో మార్పులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందన్న వాదనపై ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఫారం-6లో చేసిన ఏ మార్పునూ తాము ఆమోదించలేదని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. సంబంధిత రికార్డులు కోర్టుకు సమర్పించిన తర్వాత అసలు మార్పులు ఎవరు చేశారో పరిశీలిస్తామని చెప్పారు.
పిటిషనర్ల ఆరోపణలు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఇతర ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలను పక్కనపెట్టి కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. SIRలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6కు అదనపు వివరాలు జత చేయడం చట్టబద్ధ ప్రక్రియకు విరుద్ధమని వాదించారు. అలాగే ఎన్నికల కమిషన్‌లో నిర్ణయాలు సమష్టిగా తీసుకోవాల్సిన నిబంధనను పాటించలేదని ఆరోపించారు.
సీఈసీని సస్పెండ్ చేయాలన్న విజ్ఞప్తిపై..
విచారణ సందర్భంగా సీఈసీని సస్పెండ్ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై ధర్మాసనం ప్రశ్నలు వేసింది. సీఈసీని సస్పెండ్ చేస్తే ఈసీ రోజువారీ కార్యకలాపాలు, ఎన్నికల నిర్వహణ ఎలా కొనసాగుతాయని ప్రశ్నించింది. కేవలం మీడియా కథనాల ఆధారంగా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఈసీ వివరణ ఏమిటంటే..
కోర్టు వ్యాఖ్యల అనంతరం ఈసీ వర్గాలు తమ వైఖరిని వెల్లడించాయి. అసలు ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని, SIR ప్రక్రియలో భాగంగా అదనపు డిక్లరేషన్‌ను జత చేశామని తెలిపాయి. దీనిపై కోర్టు అధికారిక రికార్డులను పరిశీలించనుంది.
కేంద్రం, ఈసీకి నోటీసులు
పిటిషన్లలో లేవనెత్తిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పందన కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఈసీకి కల్పిస్తున్న న్యాయపరమైన రక్షణపై కూడా పరిశీలన అవసరమని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణలో రికార్డులు, అధికారిక వివరణల ఆధారంగా అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.






































