యలహంక 100 శాతం నాది, నా పిల్లలదే.. కానీ వివాహ వేదిక మారుస్తున్నాం – వైఎస్ షర్మిల

APCC Chief YS Sharmila Changes Daughter's Wedding Venue Amid Yelahanka Property Dispute

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమ కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేదిక మార్పుపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. బెంగళూరులోని యలహంక నివాసంలో వివాహం జరపాలని అనుకున్నప్పటికీ, వివాదాలు లేని వాతావరణంలో వివాహం జరిపించాలనే ఉద్దేశంతో వేదికను మారుస్తున్నట్లు వెల్లడించారు.

తమ కుటుంబ ఆస్తుల పంపకాల్లో భాగంగా యలహంక ప్రాపర్టీ 100 శాతం తనకూ, తన పిల్లల భాగానికే వచ్చిందని, ఇది దేవుడి సాక్షిగా నిజమని ఆమె స్పష్టం చేశారు. నాన్న వైఎస్‌ఆర్‌ తిరిగిన ఇల్లు కావడంతో, తన కుమార్తె అంజిలి కోరిక మేరకు అక్కడ వివాహం జరిపించాలని భావించినట్లు పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల ప్రకటనలోని ముఖ్యాంశాలు:

  • ఆస్తుల పంపకంపై స్పష్టత: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఆస్తుల పంపకాల్లో యలహంక ఇల్లు పూర్తిగా తమ భాగానికే వచ్చిందని తెలిపారు.

  • కూతురి కోరిక: సొంత ఇంట్లో, వైఎస్సార్ తిరిగిన ప్రాంగణంలో వివాహం చేసుకోవాలన్న బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోతున్నందుకు తల్లిగా ఎంతో బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

  • వివాద రహితంగా వివాహం: వివాహ వేదిక వివాదంపై సోషల్ మీడియా మరియు మీడియాలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి జరిపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు.

  • నూతన వేదిక: వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల వివాహాన్ని యలహంక నివాసంలో కాకుండా, వేరే ప్రాంతంలో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని నిశ్చయించినట్లు వెల్లడించారు.

కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజలందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని కోరుకుంటూ షర్మిల తన సందేశాన్ని ముగించారు.

కాగా ఇటీవలి కాలంలో యలహంక ప్రాపర్టీకి సంబంధించి మాజీ మాముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరి షర్మిలకు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ వార్తా పత్రికలతోపాటుగా సోషల్ మీడియాలోనూ దీనిపై గత కొన్నిరోజులుగా పలురకాలుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షర్మిల తమ కుమార్తె వివాహ వేదికను మారుస్తున్నట్టు ప్రకటించడంతో పాటు యలహంక ప్యాలెస్ తమదేనని స్పష్టం చేస్తూ కీలక ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here