తుఫాన్లు, విపత్తుల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్ధత కనిపిస్తుందని పేర్కొన్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఈ మేరకు ఆయన తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు భవిష్యత్ సాంకేతికతపై ముందుచూపుతో వ్యవహరిస్తారని పీయూష్ గోయల్ ప్రశంసించారు.
టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను చంద్రబాబు ముందుగానే గుర్తిస్తారని గోయల్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల అభివృద్ధికి ఆయన ముందుచూపుతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
పెట్టుబడులతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు భరోసా, నమ్మకం కల్పించడంలో చంద్రబాబు ప్రత్యేకత చాటుకుంటున్నారని పీయూష్ గోయల్ అన్నారు. రాష్ట్రంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’గా మార్చారని ఆయన ప్రశంసించారు.
ఇక దేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మంచి వేదికగా ఎదుగుతోందని గోయల్ ధీమా వ్యక్తం చేసిన మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.









































