ఎలాంటి సందేహాలు వద్దు.. ఏపీలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Dy CM Pawan Kalyan Assures Investors For Complete Support and Ease of Doing Business in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులువైన విధానాలను అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌. ఈ మేరకు ఆయన గురువారం విశాఖపట్నం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలు ఎలాంటి సందేహాలు లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పూర్తి భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన మానవ వనరులు, సహజ సంపద ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. కేవలం పెద్ద పరిశ్రమలే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను పారదర్శకంగా, ఎటువంటి జాప్యం లేకుండా అందించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తున్నామని పవన్ కల్యాణ్‌ తెలిపారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్ధిని సాధిస్తూ, పారిశ్రామిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో అందరి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here