ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌ నాగబాబుకు కేబినెట్ హోదా

AP Govt Provides Cabinet Rank For AP-GREEN Executive Committee Chairman Nagababu

ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీ గ్రీన్ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన జనసేన ఎమ్మెల్సీ, సినీ నటుడు కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకోలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్’ (AP-GREEN) ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనం, అటవీకరణ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల అమలు, నిర్వహణతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించే బాధ్యత నాగబాబుపై ఉంటుంది.

‘స్వర్ణాంధ్ర విజన్-2047’, ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047’ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో అటవీ ప్రాంతం, గ్రీన్ కవర్‌ను 50 శాతానికి పెంచడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పెద్ద ఎత్తున అటవీకరణ చేపట్టడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

రాష్ట్రస్థాయి గ్రీన్ మిషన్‌కు అనుసంధానంగా జిల్లాల్లో డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీస్ (DGDAs) ఏర్పాటు చేసి స్థానికంగా చేపట్టే హరిత కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. పర్యావరణం, అటవీ శాఖలతో పాటు పంచాయతీరాజ్, విద్య, వ్యవసాయం, పరిశ్రమల శాఖల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here