ధవళేశ్వరం బ్యారేజ్‌కి రూ.150 కోట్లతో 117 కొత్త గేట్లు – శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Launches New 17 Gates Construction Worth Rs.150 Cr at Dhavaleswaram Cotton Barrage

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి మౌలిక సదుపాయాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాల లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టారు. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో 117 కొత్త గేట్ల ఏర్పాటు, ఇతర ఆధునికీకరణ పనులను అధికారికంగా ప్రారంభించారు.

పైలాన్ ఆవిష్కరణ.. రైతులతో ముఖాముఖి

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పరిధిలోని పిచ్చుకలంకకు చేరుకుని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి నిర్వహణ, వ్యవసాయాభివృద్ధి, రైతుల సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఆయన మాట్లాడారు. రైతుల సూచనలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలవరం ప్రాజెక్టు పరిశీలన

అనంతరం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పురోగతిని పరిశీలించిన ఆయన, అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-2, జలవిద్యుత్ కేంద్రం, ఇతర నిర్మాణాలకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను వీక్షించి ప్రాజెక్టు పనుల తాజా స్థితిగతులను తెలుసుకున్నారు.

నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు చేపడుతున్న పనులపై సీఎం చంద్రబాబు సమగ్రంగా ఆరా తీశారు. నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమని పేర్కొంటూ, నాణ్యతతో పాటు వేగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here