కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ

AP CM YS Jagan Writes Letter To PM Modi Over Covid Vaccination

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

“రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించాం. తగినన్ని వ్యాక్సిన్ డోసులు లేకపోవడంతో ముందుగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కాగా ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా కోవిడ్‌ వ్యాక్సిన్లు కొనుగోలు చేయొచ్చనే కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోంది. వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్‌ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసులుబాటు ఉండడంతో, కొన్ని ఆసుపత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, వారి విమర్శలకు దారి తీస్తోంది” అని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.

“ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా కోవిడ్‌ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరికాదు. వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు అధిక ధరలకు వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది. అలాగే డిమాండ్‌ పెరగడంతో పాటుగా వాక్సిన్ల బ్లాక్‌ మార్కెట్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, ప్రైవేటులో కూడా వాక్సిన్‌ వేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం మంచి ఆలోచనే అయినప్పటికీ అవసరానికి మించి వాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పుడే మంచి నిర్ణయం అవుతుంది. వాక్సిన్‌ పూర్తిగా అందుబాటులో ఉంటే స్థోమతను బట్టి ఇష్టం ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాక్సిన్‌ వేయించుకుంటారు. కానీ ప్రస్తుతం  డిమాండ్‌ కంటే చాలా తక్కువగా వాక్సిన్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా వ్యాక్సిన్స్ కొనుగోలు చేసేలా అనుమతి ఇచ్చారు. ప్రజల నుంచి వారు ఇష్టానుసారం ధర వసూలు చేసే అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాను. దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్‌ వేసే వీలుంటుంది. వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ ను అరికట్టేలా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

 

 

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =