పార్టీకి తానే కమాండర్ అని, తన మాట వినాల్సిందేనని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ముఖ్య నేతల అంతర్గత సమావేశంలో పాల్గొన్న ఆయన, వ్యూహాల బాధ్యతను పూర్తిగా తనకు వదిలేయాలని, తాను తీసుకునే నిర్ణయాలను నాయకులు పక్కాగా ఆచరించాలని దిశా నిర్దేశం చేశారు. జనసేన నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మెత్తగా ఉండొద్దని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా పార్టీ నుంచి తప్పించడానికి వెనుకాడనని కూడా ఆయన హెచ్చరించారు.
లీక్ చేస్తే సహించేది లేదు
ఇబ్బందులు శ్రుతిమించిపోయి ఎదిరించక తప్పని పరిస్థితి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అయితే మనం గొడవపడే అంశం సరైనదై ఉండాలని, దానిని అందరూ మెచ్చుకునేలా ఎదిగేందుకు ఉపయోగపడాలని సూచించారు. పార్టీలో ఎవరికైనా ఏకాభిప్రాయానికి రావడంలో ఇబ్బందులు ఉంటే తప్పుకోవచ్చని, కానీ అంతర్గత విభేదాలతో పౌరసరఫరాల బియ్యం లాంటి సున్నితమైన అంశాలపై వ్యతిరేక వార్తలు లీక్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
తమిళ రాజకీయాలు చూస్తుంటే.. అసూయగా ఉంది
నాదెండ్ల మనోహర్ నాయకత్వాన్ని సమర్థిస్తూ, ఆయనను మళ్లీ పార్టీలో కీలక స్థానంలోనే ఉంచుతున్నానని, అందరూ కచ్చితంగా అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ కటౌట్లు, హోలోగ్రామ్‌లు పెట్టుకుని చాలా సుఖంగా రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రి అయిపోతుంటే, తనను మాత్రం గత 15 ఏళ్లుగా రోడ్లపై నడిపించారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అమిత్ షాతో మాట్లాడటానికి ఇంకేం లేవా?
తాను 30 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ మధ్యకాలంలో కొందరు విశ్లేషకులు ముఖ్యమంత్రి కాలేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని ప్రస్తావించారు. అలాగే వైకాపా నేతలను జైల్లో పెట్టాలని తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. నేరం చేసిన వారిని జైలుకు పంపడానికి దేశంలో ప్రత్యేక వ్యవస్థలు, ఏసీబీ కోర్టులు ఉన్నాయని, తానే స్వయంగా చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి, శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ఈ అంతర్గత సమావేశం అత్యంత కీలకంగా మారింది. పవన్ కల్యాణ్ కమాండర్ హోదాలో ఇచ్చిన ఈ హెచ్చరికలు, దిశా నిర్దేశం రాబోయే రోజుల్లో కూటమి రాజకీయాల్లో మరియు జనసేన అంతర్గత నిర్వహణలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే పార్టీ శ్రేణులు ప్రజల్లో చురుగ్గా ఉండేలా ఈ వ్యాఖ్యలు ప్రేరేపించనున్నాయి.






































