సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో మిషన్ మోడ్ కాకుండా కమిషన్ మోడ్ అవలంబిస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీ ట్రిప్పులు, గారడీ మాటలు పక్కనబెట్టి కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన డెడ్‌లైన్ విధించారు.
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను హరీశ్‌రావు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వం, ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో కూడా రైతులకు ఇంతటి కష్టం ఎన్నడూ రాలేదని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే మొదట 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి, ఇప్పుడు 70 లక్షల టన్నులకే పరిమితం చేయడం వల్ల మిగతా ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా అని ప్రశ్నించారు. మిల్లుల్లో బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారని, దీనిపై అధికారులు కూడా బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రోహిణీ కార్తె వచ్చినా కొనుగోళ్లు కాక వడ్లు కల్లాల్లోనే ముగ్గుతున్నాయని, ఇంకా రెండు వంతుల వడ్లు ఆరుబయటే ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. వర్షాలకు తడిసి వడ్ల కుప్పలపైనే మెదక్ జిల్లా కొల్చారంలో ఒక రైతుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10-12 మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. కనబడ్డ దేవుళ్లందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పారని, అలాగే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో 45 రోజుల్లో రైతుబంధు ఇస్తామని చెప్పి 63 రోజులు దాటినా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని విమర్శించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ వ్యక్తిగతంగా తిడుతున్నారని, తాము ఎన్ని తిట్లు అయినా పడతాం కానీ రైతులకు మాత్రం కాంటాలు పెట్టి, లారీలు, గన్నీ బ్యాగులు పంపాలని సూచించారు. వెంటనే మక్కలు, సన్ ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతులకు కూడా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న ఈ ధాన్యపు సంక్షోభం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలలో లారీల సంఖ్యను, గన్నీ బ్యాగుల సరఫరాను పెంచడంతో పాటు మిల్లుల వద్ద తరుగు పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాల్సి ఉంది. ప్రతిపక్షాలు విధించిన రెండు రోజుల గడువు లోపు కొనుగోళ్లు వేగవంతం కాకుంటే కలెక్టరేట్ల దిగ్బంధనం వంటి నిరసనలతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.




































