మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

AP Deputy CM Pawan Kalyan Meets Maharashtra CM Devendra Fadnavis in Mumbai

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మంగళవారం ముంబైలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణపై ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.”

“తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది.”

“శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”

“వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తాం” అని తెలిపారు. కాగా, రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ వన్యప్రాణి పరిరక్షణ ఒప్పందం రాబోయే రోజుల్లో దేశంలోనే ఆదర్శవంతమైన పర్యావరణ భాగస్వామ్యంగా నిలవడమే కాకుండా, అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణకు సరికొత్త ఊతం ఇవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here