స్పేస్‌ ఎక్స్‌ అసాధారణ ప్రయోగం.. అంతరిక్షంలోకి 10 లక్షల ఉపగ్రహాలు, ఎఫ్‌సీసీ ఆమోదం

US FCC Grants SpaceX Landmark Approval To Deploy Upto 1 Million Satellites For Orbital AI Data Centres

అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ – AI) డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు గరిష్ఠంగా 10 లక్షల (1 మిలియన్) ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ఆమోదం తెలిపింది.

కక్ష్యలో డేటా సెంటర్ నెట్‌వర్క్‌కు ఇలాంటి అనుమతి లభించడం ఇదే తొలిసారి అని, ఇది కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఎఫ్‌సీసీ చైర్మన్ బ్రెండన్ కార్ పేర్కొన్నారు.

స్పేస్‌ఎక్స్ ప్రతిపాదించిన ‘స్టార్‌మైండ్’ వ్యవస్థ సౌరశక్తి సాయంతో పనిచేస్తూ, ఏఐ కంప్యూటింగ్ అవసరాలకు సంబంధించిన భారీ డేటాను అంతరిక్షంలోనే ప్రాసెస్ చేసి ఫలితాలను భూమికి పంపేలా రూపొందించారు.

భూమిపై వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్ల వల్ల విద్యుత్ గ్రిడ్‌లు, నీటి వనరులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, సౌరశక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రోదసి ఆధారిత డేటా సెంటర్లు ఉపయోగపడతాయని మద్దతుదారులు చెబుతున్నారు.

ఈ ఉపగ్రహాలు ప్రధానంగా ఆప్టికల్ ఇంటర్-శాటిలైట్ లింకుల ద్వారా అనుసంధానమవుతాయని, టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ వంటి అత్యవసర, బ్యాకప్ అవసరాలకు మాత్రమే రేడియో ఫ్రీక్వెన్సీలను వినియోగిస్తాయని ఎఫ్‌సీసీ ఉత్తర్వులో స్పష్టం చేసింది.

ఎఫ్‌సీసీ ఆమోదం ప్రకారం స్పేస్‌ఎక్స్ నిర్దిష్ట గడువుల లోపు దశలవారీగా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టాలి. 2033 నవంబర్ 25 నాటికి కనీసం ఒక ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో మోహరించి నిర్వహించాలి. అలాగే, 2035 నాటికి లక్ష ఉపగ్రహాలను, 2038 నాటికి 5 లక్షల ఉపగ్రహాలను, 2040 నాటికి మొత్తం 10 లక్షల ఉపగ్రహాల మోహరింపును పూర్తి చేయాలి.

మరోవైపు, భారీ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడంపై అమెరికన్ ఆస్ట్రానమికల్ సొసైటీ (AAS) సహా పలు సంస్థలు, పోటీ శాటిలైట్ ఆపరేటర్ల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాత్రి ఆకాశ పరిశీలన, ఖగోళ పరిశోధనలకు అంతరాయం కలగవచ్చని, అంతరిక్ష శిథిలాలు, ఢీకొనే ప్రమాదాలు, ప్రయోగాలు-పునఃప్రవేశాల వల్ల వాతావరణ ప్రభావాలు ఉండవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

అయితే అంతరిక్ష శిథిలాల నియంత్రణ నిబంధనలకు అనుగుణంగానే ఈ ఆమోదం ఇచ్చామని ఎఫ్‌సీసీ పేర్కొంది. స్టార్‌షిప్ పునర్వినియోగ రాకెట్ ఖర్చులు తగ్గడం వంటి అంశాలపై ఆధారపడి ఈ ప్రణాళికను సంస్థ ముందుకు తీసుకెళ్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here