పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నేతలే – మాజీ మంత్రి హరీశ్ రావు

Former Minister Harish Rao Hits Back at CM Revanth Reddy Over Krishna Waters

కృష్ణా జలాల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావు దీటుగా బదులిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి హయాంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా అని సూటిగా ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు (లిఫ్టులు) ఎన్ని రోజులు నడిపారో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన జీవో నంబర్ పూర్తిగా తప్పని, పత్రాల్లో ‘ఒంగోలు బ్రాంచ్ కెనాల్’ అని ఉంటే సీఎం దాన్ని ‘నాగార్జున సాగర్ కెనాల్’ అని తప్పుగా చదివి ప్రజలను తప్పుదోవ పట్టించారని హరీశ్ రావు ఆరోపించారు.

తెలంగాణ నీటి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసింది కేవలం బీఆర్‌ఎస్ పార్టీయేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తప్పా, కృష్ణా జలాల న్యాయమైన వాటా కోసం సెక్షన్-3 తేవడం తప్పా అని నిలదీశారు. టీఆర్‌ఎస్ పార్టీ పుట్టకముందు ఉమ్మడి రాష్ట్రంలో అసలు తెలంగాణ నీళ్ల గురించి ఎవరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాడుతుంటే రేవంత్ రెడ్డి ఏనాడైనా మాట్లాడారా అని, పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నేతలేనని విమర్శించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో సాగర్ కుడి కాల్వకు ఒక నీతి, ఎడమ కాల్వకు మరో నీతి ఉండేదని, టీఆర్‌ఎస్ ఏర్పాటుకు ముందు జూరాల ప్రాజెక్టుకు అసలు ఆయకట్టే లేదని హరీశ్ రావు గుర్తుచేశారు. మెదక్ జిల్లాకు సాగునీరు వచ్చిందంటే అది కేవలం కేసీఆర్, బీఆర్‌ఎస్ వల్లే సాధ్యమైందన్నారు. 30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరు జిల్లాలో కేవలం 30 వేల ఎకరాలకే నీళ్లిస్తే, బీఆర్‌ఎస్ హయాంలో తాము ఏకంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గణాంకాలతో వివరించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పాలమూరులో అదనంగా లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా అని సవాల్ విసిరారు.

ఏపీ ప్రభుత్వం 2024 డిసెంబర్ 3న 403, 405 జీవోల ద్వారా కుప్పం కాల్వకు లైనింగ్ పనులు చేయించిందని, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు నియోజకవర్గం కుప్పం వరకు కృష్ణా నీళ్లు ఎలా పారుతున్నాయని హరీశ్ రావు ప్రశ్నించారు. పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం కృష్ణా జలాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగానే వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here