అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో కీలకమైన సీఈఓ పోస్టు భర్తీకి ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ పదవి కోసం దేశవ్యాప్తంగా 5,300 మందికి పైగా దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 18 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసినట్లు ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. మంగళ, బుధవారాల్లో అయోధ్య ఆలయ ప్రాంగణంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ముగ్గురు సభ్యుల ప్యానెల్‌తో ఇంటర్వ్యూలు
సీఈఓ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులను మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేదీ, షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు మాజీ చైర్మన్ సురేశ్ హవారేలతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఇంటర్వ్యూ చేయనుంది. ఇంటర్వ్యూల అనంతరం అర్హత, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేపట్టనున్నట్లు సమాచారం.
సీఈఓగా ఎలాంటి అర్హతలు?
సీఈఓ పోస్టుకు 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తిని ఎంపిక చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. హిందూ మతాన్ని ఆచరించే, శాకాహారులైన అభ్యర్థులనే ఈ పదవికి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
రామమందిరానికి సంబంధించిన పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, విరాళాలు, భద్రత, ఇతర కీలక అంశాలను సమన్వయం చేయడం సీఈఓ బాధ్యతల్లో ప్రధానంగా ఉండనున్నాయి.
విరాళాల చోరీ నేపథ్యంలో కీలక నియామకం
రామమందిర విరాళాలకు సంబంధించిన చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ట్రస్టు సీఈఓ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిపాలనను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగానే ఈ నియామకాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.
విరాళాల చోరీ కేసులో ఎనిమిది మంది అదుపులోకి
మరోవైపు, రామమందిర విరాళాల చోరీపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల్లో శుక్లా నుంచి అత్యధికంగా రూ.20.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామమందిర ట్రస్టు పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు కొత్త సీఈఓ నియామకం కీలకంగా మారింది.






































