‘తమిళ్ తాయ్ వాళ్తు’ ఆలపించడం తప్పనిసరి – తీర్మానానికి తమిళనాడు శాసనసభలో ఆమోదం

Tamil Nadu Assembly Unanimously Passes Resolution on Tamil Thai Vazhthu

తమిళనాడులో భాషా, సాంస్కృతిక గుర్తింపునకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను ‘తమిళ్ తాయ్ వాళ్తు’తో ప్రారంభించడాన్ని తప్పనిసరి చేసే తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సభలో ప్రవేశపెట్టారు.

తీర్మానం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తప్పనిసరిగా ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ఆలపించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది.

డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, సీపీఐ, బీజేపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీల సభ్యులు తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. దీంతో తీర్మానం ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

కాగా, ‘తమిళ్ తాయ్ వాళ్తు’ విషయంలో తమిళనాడులో కొంతకాలంగా రాజకీయ వివాదం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందుగా ‘వందే మాతరం’, ఆ తర్వాత జాతీయ గీతం, అనంతరం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ ఆలపించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారిక కార్యక్రమాల్లో ‘తమిళ్ తాయ్ వాళ్తు’కు ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్‌ మరింత బలపడింది. తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఇకపై తమిళనాడులోని అధికారిక కార్యక్రమాల్లో తమిళ గీతం ఆలాపనకు స్పష్టమైన నిబంధన అమల్లోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here