ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెరిసింది. గతేడాది టైటిల్ గెలిచిన ఈ జట్టు ఈ ఏడాదీ తన పట్టు నిలుపుకుంది. ఫైనల్ పోరులో సంచలన విజయం సాధించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరు జట్టు కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో బెంగళూరు అభిమానులు ‘ఈ సాలనూ కప్ నమ్దే’ (ఈ ఏడాది కూడా కప్పు మనదే) అంటూ మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు.
అల్లాడిన గుజరాత్ బ్యాటర్లు.. నిలబడ్డ సుందర్
ఈ కీలక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. బెంగళూరు బౌలర్ల ధాటికి సక్సెస్ఫుల్ ఓపెనర్లుగా పేరొందిన గిల్ (10), సుదర్శన్ (12) మొదటి నాలుగు ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరారు. దీంతో గుజరాత్ పవర్‌ప్లే ముగిసేసరికి 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. యువ బ్యాటర్ నిశాంత్ (20) మూడు ఫోర్లతో కాసేపు మెరిసినా రసిఖ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
వెటరన్ బ్యాటర్ బట్లర్ (19) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఒక దశలో 7 నుంచి 12 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదంటే బెంగళూరు బౌలర్లు ఎంతలా కట్టడి చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే, వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఒంటరి పోరాటం చేసి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టు స్కోరును వందన్నర దాటించాడు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో రసిఖ్‌కు మూడు, భువనేశ్వర్, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
చేజింగ్ రారాజు కోహ్లీ విశ్వరూపం
156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (16 బంతుల్లో 32) వేగంగా ఆడి జట్టు స్కోరును పెంచాడు. నాలుగో ఓవర్లో విరాట్ కోహ్లీ ఒకే ఓవర్లో 4,4,6,4తో విరుచుకుపడటంతో జట్టు స్కోరు 4 ఓవర్లలోనే 55 పరుగులకు చేరింది. అయ్యర్, దేవ్‌దత్ (1) వరుసగా అవుట్ అయినా కోహ్లీ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రజత్ (15), కృనాల్ పాండ్యా (1) వికెట్లు తీసి మ్యాచ్‌లో ఉత్కంఠ రేపినా కోహ్లీ అదరలేదు.
కేవలం 25 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టిమ్ డేవిడ్ (24) ఉన్నంతసేపు వేగంగా ఆడి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జితేష్ (11 నాటౌట్) సహకారంతో కోహ్లీ మరో 12 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు. కోహ్లీ మొత్తం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
స్కోరుబోర్డు
గుజరాత్ బ్యాటింగ్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 12, గిల్ (సి) రజత్ (బి) హాజెల్‌వుడ్ 10, నిషాంత్ (సి) పడిక్కళ్ (బి) రసిఖ్ 20, బట్లర్ (స్టంప్డ్) జితేశ్ (బి) కృనాల్ పాండ్యా 19, వాషింగ్టన్ (నాటౌట్) 50, అర్షద్ (సి) రసిఖ్ (బి) హాజెల్‌వుడ్ 15, తెవాటియా (సి) రజత్ (బి) రసిఖ్ 7, హోల్డర్ (సి) హాజెల్‌వుడ్ (బి) భువనేశ్వర్ 7, రషీద్ (సి) షెఫర్డ్ (బి) రసిఖ్ 7, రబాడ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 155/8.
వికెట్ల పతనం: 1-22, 2-26, 3-55, 4-73, 5-99, 6-115, 7-142, 8-151.
బౌలింగ్: డఫీ 4-0-38-0, భువనేశ్వర్ 4-0-29-2, హాజెల్‌వుడ్ 4-0-37-2, రసిఖ్ 4-0-27-3, కృనాల్ పాండ్యా 4-0-23-1.
బెంగళూరు బ్యాటింగ్: వెంకటేశ్ (సి) రబాడ (బి) సిరాజ్ 32, కోహ్లీ (నాటౌట్) 75, పడిక్కళ్ (సి) అర్షద్ (బి) రబాడ 1, రజత్ పటీదార్ (సి) రబాడ (బి) రషీద్ 15, కృనాల్ పాండ్యా (ఎల్బీ) రషీద్ 1, టిమ్ డేవిడ్ (సి) బట్లర్ (బి) అర్షద్ 24, జితేశ్ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 18 ఓవర్లలో 161/5.
వికెట్ల పతనం: 1-62, 2-63, 3-89, 4-91, 5-132.
బౌలింగ్: సిరాజ్ 4-0-36-1, రబాడ 3-0-44-1, హోల్డర్ 2-0-16-0, రషీద్ 4-0-25-2, అర్షద్ 4-0-32-1, ప్రసిద్ధ్ 1-0-7-0.



































