కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు – ప్రధాని మోదీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP Dy CM Pawan Kalyan Praises PM Modi at Bhogapuram Airport Inauguration

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని అహోరాత్రులు కృషి చేస్తున్నారని కొనియాడారు.

తెలుగుజాతి ఎవరికీ తలవంచదని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గర్జించిన నేల ఇది అని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

మౌలిక వసతుల కల్పనే దేశ ప్రగతికి మూలస్తంభమని గుర్తించిన ప్రధాని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కాలాన్ని నెరవేర్చారని తెలిపారు. దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపించేందుకు ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవని పేర్కొన్నారు. నిరంతరం శ్రమిస్తున్న ప్రధానికి గతంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, ఢిల్లీ వేదికగా విమర్శలు గుప్పించినా భయపడకుండా ముందుకు సాగారని చెప్పారు.

కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగలడం సహజమని, తనను దూషించే వారిని కూడా క్షమించే గొప్ప గుణం ప్రధాని వద్ద ఉందన్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సంక్షేమం కోసం పరితపించే నాయకుడు లభించడం దేశ ప్రజల అదృష్టమని అభిప్రాయపడ్డారు. భోగాపురం విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు, పర్యాటకం, రవాణా రంగాలకు విశేష ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయని వివరించారు.

ఇక ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరిన్ని పారిశ్రామిక విజయావకాశాలను సొంతం చేసుకుంటుందని స్పష్టమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here