ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు’పై పార్లమెంటరీ సంయుక్త సంఘం (JPC) కీలకమైన మార్పులను సూచిస్తూ తన ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అస్థిరపరచడానికే దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ఈ క్రూర బిల్లును తెచ్చారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, జేపీసీ ఇందులో ఐదు ప్రధాన సురక్షిత మార్పులను సిఫారసు చేసింది.
తీవ్ర నేరాల ఆరోపణలతో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు లేదా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే, వరుసగా 30 రోజులకు పైబడి జ్యుడీషియల్ కస్టడీలో ఉండి, వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే 31వ రోజున స్వయంచాలకంగా (ఆటోమేటిగ్గా) పదవి కోల్పోతారనే నిబంధనతో కూడిన ఈ బిల్లును గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
శాశ్వత ఉద్వాసన లేదు.. కేవలం సస్పెన్షన్ మాత్రమే!
రాజ్యాంగ నిపుణులు, పాలనావేత్తలతో జరిపిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం, కస్టడీలో ఉన్న నేతలను పదవుల నుండి ‘శాశ్వతంగా తొలగించడం’ అనే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘శాశ్వత తొలగింపు’ అనే పదం స్థానంలో, సదరు నేతలు కేవలం ‘సస్పెన్షన్’లో ఉంటారనే పదాన్ని చేర్చాలని జేపీసీ సిఫారసు చేసింది.
అంతేకాకుండా, నిర్దిష్ట 30 రోజుల గడువులోగా వారు నిర్దోషులుగా విడుదలైతే లేదా ప్రాసిక్యూషన్ నిర్దేశిత గడువులోగా ముందుకు వెళ్లలేకపోతే, వారు ఆటోమేటిగ్గా తిరిగి తమ అధికారిక పదవుల్లోకి వచ్చేలా మార్పులు చేయాలని స్పష్టం చేసింది. అయితే, కేంద్ర హోం శాఖ మాత్రం ఈ ‘సస్పెన్షన్’ అనే పదంపై కొంత అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తీవ్ర నేరాల నిర్వచనం – జేపీసీ కీలక మార్గదర్శకాలు
బిల్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు జేపీసీ మరికొన్ని కీలక సవరణలను ముసాయిదాలో పొందుపరిచింది:
-
నేరాల స్పష్టత: బిల్లులో పేర్కొన్న ‘తీవ్ర నేరాభియోగాల’ను కమిటీ స్పష్టంగా నిర్వచించింది. ఐదేళ్లు అంతకుపైబడి శిక్ష పడే నేరాలను మాత్రమే దీని కిందికి తీసుకురావాలని, సస్పెన్షన్‌కు గురయ్యే నేరాలేమిటో నిర్దిష్టంగా బిల్లులో పేర్కొనాలని ప్రతిపాదించింది.
-
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతలు ఎదుర్కొనే కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది. కోర్టులు వారిని నిర్దోషులుగా తేల్చితే వెంటనే పునర్నియమితులయ్యేలా సురక్షిత చర్యలు ఉండాలంది.
-
కొలమానంలో మార్పు: 30 రోజుల కస్టడీకి ప్రత్యామ్నాయంగా, సదరు నిందితులపై కోర్టులో ‘అభియోగాల నమోదు దశ’ను (Framing of Charges) పదవీ చ్యుతికి ప్రాథమిక కొలమానంగా తీసుకోవచ్చని జేపీసీ సూచించింది.
మూడింట రెండొంతుల మెజారిటీ కోసం మోదీ ప్రభుత్వం వ్యూహాలు
ఈ ప్రతిపాదిత సవరణలను కేంద్ర హోం శాఖ త్వరలోనే కేంద్ర మంత్రివర్గం (క్యాబినెట్) దృష్టికి తీసుకెళ్లనుంది. క్యాబినెట్ ఆమోదం లభిస్తే, ఈ నెల జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో లోక్‌సభలో అధికారిక సవరణల బిల్లును ప్రవేశపెడతారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ అవసరం. గత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌తో నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెడుతూ హడావుడిగా తెచ్చిన బిల్లు వీగిపోయిన అనుభవాల దృష్ట్యా, ఈసారి సరికొత్త వ్యూహాత్మక అడుగులతో సంఖ్యాబలాన్ని సాధించి, విపక్షాల మద్దతుతో ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.






































