‘నీట్’ ఉద్యమంలో కీలక మలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ

NEET Row Sonam Wangchuk Ends 26-Day Hunger Strike After Centre's Assurance

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ సంప్రదింపుల ఫలంగా ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. గురువారం అర్ధరాత్రి గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన దీక్షను ముగించారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణపై ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీలతో వాంగ్‌చుక్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర మంత్రుల సమక్షంలో దీక్ష విరమణ

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంతో పాటు విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజులుగా దీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించిన కేంద్ర ప్రభుత్వం ఆయనతో చర్చలు జరిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వాంగ్‌చుక్‌కు పండ్ల రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ప్రభుత్వ హామీలు – ప్రధాని మోదీ స్పందన

శాంతియుతంగా నిరసన తెలపిన విద్యార్థులు, యువతపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని, పార్లమెంట్‌లో పరీక్షల నిర్వహణ వ్యవస్థ ప్రక్షాళనపై సమగ్ర చర్చ జరుపుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, వాంగ్‌చుక్ త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించారు. వైద్యుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలతో నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేపర్ లీకేజీల నిరోధానికి రానున్న రోజుల్లో పార్లమెంట్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

విద్యార్థులు ఒంటరి వారు కారు

మరోవైపు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో విపక్ష కూటమి నాయకులు దిల్లీలోని గాంధీ స్మృతి కేంద్రానికి చేరుకుని కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నీట్‌ పేపర్‌ లీక్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు విపక్ష నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు విద్యావ్యవస్థలో తగిన సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని విపక్ష కూటమి ఈ నిర్ణయం తీసుకుంది.

అంతకుముందు రాహుల్‌, ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలు బస్సుల్లో అక్కడికి బయలుదేరగా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో రాహుల్‌ గాంధీ నివాసం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్‌ గాంధీ, విద్యార్థుల డిమాండ్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, దేశంలో విద్యార్థులు ఎవరూ ఒంటరి వారు కాదని స్పష్టం చేశారు.

జంతర్‌మంతర్‌ వద్ద తీవ్ర ఆంక్షలు – ఇంటర్నెట్‌ నిలిపివేత

మరోవైపు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా జంతర్‌మంతర్‌ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. నీట్ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునే వరకు విద్యార్థుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని విపక్ష కూటమి నేతలు ఉద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here