రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ అస్త్రం.. భారత్‌పై 100% టారిఫ్‌ల భారం

US Senate Passes Russia Sanctions Bill, India Faces 100% Tariff Risk

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది. రష్యా, ఇరాన్‌పై ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఉద్దేశంతో రూపొందించిన ‘శాంక్షనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. 86-11 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించడం ఈ బిల్లులోని ప్రధాన అంశం. భారత్‌తో పాటు చైనా, స్లొవేకియా, హంగరీ, అజర్‌బైజాన్ వంటి రష్యా చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఈ సుంకాల ప్రభావం పడే అవకాశం ఉంది.

ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధాన్ని ముగించేందుకు మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశంగా అమెరికా పేర్కొంటోంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అధిక టారిఫ్‌లు విధించడం ద్వారా రష్యా ఆదాయాలను తగ్గించి, యుద్ధానికి ఆర్థికంగా మద్దతు లభించకుండా చేయాలని అమెరికా భావిస్తోంది.

ఇక ఈ బిల్లు తదుపరి ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం లభించి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తేనే ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది. గతంలో రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై మరింత భారీగా సుంకాలు విధించే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, తాజా బిల్లులో గరిష్ఠంగా 100 శాతం టారిఫ్‌లకు అవకాశం కల్పించారు.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ బిల్లుకు సెనెట్ ఆమోదం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఈ ప్రతిపాదిత టారిఫ్‌లు అమల్లోకి వస్తే అమెరికా మార్కెట్‌కు భారత ఉత్పత్తుల ఎగుమతులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

అదే సమయంలో రష్యా నుంచి చౌక ధరలకు ముడి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ తన ఇంధన అవసరాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిపాదిస్తున్న అధిక సుంకాలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు దేశీయ ఇంధన వ్యూహంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here