వ్యవసాయరంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుంది: సీఎం కేసీఆర్

Agriculture Department, CM KCR, CM KCR Review Meeting, CM KCR Review Meeting on Agriculture Department, KCR Maize, Rainy Season Crops, Telangana Agricultural News, telangana agriculture budget, Telangana Agriculture News, Telangana CM KCR

తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. ప్రగతిభవన్ లో శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

వ్యవసాయరంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుంది:

‘‘తెలంగాణ రాష్ట్రంలో 60శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నది. వ్యవసాయరంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయరంగ అభివృద్ధికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, క్లస్టర్ల ఏర్పాటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం తదితర చర్యల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందటి పరిస్థితితో పోల్చుకుంటే వ్యవసాయరంగం ముఖచిత్రమే మారిపోయింది. దేశంలోనే అత్యధికంగా వరిపంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. ఇంకా మిగతా పంటల్లో కూడా ఎంతో పురోగతి ఉంది. భవిష్యత్ లో వ్యవసాయరంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది. నిర్ణీత పంటలసాగు విధానం ద్వారా రైతులకు మంచి ధర వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగంగా నిలుస్తున్నది. వ్యవసాయశాఖ బాధ్యతలు కూడా ఎంతో పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖలో సంస్థాగత మార్పులు జరగాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.

వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు:

‘‘వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి. ఒక విభాగం సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ మౌలిక సదుపాయాలను పర్యవేక్షించాలి. ఆయా శాఖలతో సమన్వయం కుదుర్చుకోవాలి. మరో విభాగం మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఏ పంటవేస్తే రైతులకు లాభం? తదితర విషయాలను అధ్యయనం చేయాలి. మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లయీస్, వ్యాపారులతో సమన్వయం కుదుర్చుకొని రైతులకు మంచిధర వచ్చే విధంగా వ్యూహాలు రూపొందించాలి. ఈ రెండు విభాగాలకు ఐఏఎస్ అధికారులు నేతృత్వం వహించాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

‘‘గోదావరిపై నిర్మించిన కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల వల్ల 24 జిల్లాలు సుభిక్షంగా మారాయి. వీటికిక సాగునీటికి ఢోకా ఉండదు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట,సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాలు గోదావరి ప్రాజెక్టుల కింద కవర్ అవుతున్నాయి. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టుల ద్వారా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు సుభిక్షంగా మారబోతున్నాయి. అయితే, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు ఒకేసారి నీళ్లు రావు. ఒక్కో ప్రాజెక్టు ఒక్కో సమయంలో నిండటం వల్ల ఆయా ప్రాంతాల్లో పంటకాలాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. దీనికి అనుగుణంగానే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలి, పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి’’ అని సీఎం సూచించారు.

‘‘రాష్ట్రంలో రైతులు ఇప్పటిదాకా కొన్నిరకాల పంటలు వేయడానికి మాత్రమే అలవాటు పడ్డారు. ఈ పద్ధతి మారాలి. మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలు వేయాలి. నిర్ణీత పంటల సాగు విధానాన్ని సూచిస్తుంది అందుకే. వరి, పత్తితోపాటు కొన్ని పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. రాష్ట్రంలో కందులసాగు 20 నుండి 25 లక్షల ఎకరాల వరకు సాగవ్వాలి. 12 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్, 15 లక్షల ఎకరాల్లో మిరప, పసుపు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పంటలు సాగవ్వాలి. నీటి లభ్యత, భూముల రకం, వాతావరణం, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎప్పటికప్పుడు ఏ పంటలు వేయాలనే విషయంలో అధికారులు దిశానిర్దేశం చేయాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 1 =