పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభావాలపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

Minister KTR Writes Open Letter to Union Govt on Petrol and Diesel Price Hike and its Effects,Minister KTR Writes Open Letter to Union Govt,Minister KTR on Petrol and Diesel Price Hike,Petrol and Diesel Price Hike and its Effects,Mango News,Mango News Telugu,Minister KTR Asks Centre To Apologise People,Apologise to the nation for the fuel price hike,Telangana Minister KTR Asks Centre To Apologise,Minister KTR Open Letter To PM MODI,Minister KTR Slams Centre On Fuel Prices Hike,Petrol and Diesel Price Hike Latest News,Petrol and Diesel Price Hike Latest Updates,Minister KTR Latest News,Minister KTR Open Letter News Today

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభావాలపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నదని, ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నదని లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

“పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్-రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు” అని అన్నారు.

“కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును, శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతుందన్నది. తక్కువ ధరకు ముడి చమురును కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై ప్రభుత్వానికి వచ్చే విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలి. కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినప్పటికీ.. దేశ ప్రజల పట్ల మాత్రం పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోదీ అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 2013 సంవత్సరంలో ఉన్న స్థాయికి పడిపోయిన నేపథ్యంలో భారీగా పెంచిన, పెట్రోల్ రేటును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రధానమంత్రి మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ ప్రజల నుంచి పెట్రోల్ ధరల రూపంలో చేస్తున్న దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నాను” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

“మరోవైపు తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక్క రూపాయి వ్యాట్ ను పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో 30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టింది. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 70 డాలర్ల లోపు చేరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్ రేటును తగ్గించేందుకు కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. పెట్రోల్ ధరలు తగ్గాలంటే దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంలోని బాధ్యత కలిగిన మంత్రులు చెప్పడం గురువింజ సామెతను తలపిస్తుంది. జీఎస్టీ పరిధిలో ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను 400 రూపాయల నుంచి 1200 కు పెంచిన అసమర్ధ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కల్లబొల్లి కబుర్లు చెప్పడం అర్ధరహితం. ఇప్పటికే జీఎస్టీ పరిధిలో ఉన్న సిలిండర్ ధరలను కేంద్రం ఎందుకు తగ్గించలేకపోయిందో ముందు సమాధానం చెప్పాలి. ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయితే దేశ ప్రజలు మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు” అని మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here