అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మాణం: మంత్రి తలసాని శ్రీనివాస్

Minister Talasani Srinivas held High Level Review on Animal Husbandry Fisheries and Dairy Development, Minister Talasani Srinivas held High Level Review on Dairy Development, Minister Talasani Srinivas held High Level Review on Animal Husbandry Development, Minister Talasani Srinivas held High Level Review on Fisheries Development, Minister Talasani Srinivas, High Level Review on Animal Husbandry Fisheries and Dairy Development, Minister Talasani Srinivas Yadav, Telangana Dairy Development, Animal Husbandry Review New Update, Animal Husbandry Review News, Animal Husbandry Review Latest News And Updates, Animal Husbandry Review Live Updates, Mango News, Mango News Telugu

అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరానికి సమీపంలో రంగారెడ్డి జిల్లా కోహెడలో 10 ఎకరాల విస్తీర్ణంలో హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో హోల్ సేల్ తో పాటు రిటైల్ మార్కెట్ ల ఏర్పాటుతో పాటు కోల్డ్ స్టోరేజ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి వనరులు కూడా భారీగా అందుబాటులోకి రావడం, ప్రతి నీటి వనరులో చేప పిల్లలను విడుదల చేస్తున్న కారణంగా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని చెప్పారు. మత్స్యకారుల ఉపాధి అవకాశాలు కూడా ఎంతో మెరుగైనాయని పేర్కొన్నారు. పెరిగిన మత్స్య సంపదను తక్కువ ధరకు అమ్ముకొని మత్స్యకారులు నష్టపోకుండా ఆదుకునేందుకు మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ హోల్ సేల్ మార్కెట్ అందుబాటులోకి వస్తే చేపలకు మంచిధర లభించి మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఆధునిక పద్దతులతో మార్కెట్ ను నిర్మించేందుకు ఇతర రాష్ట్రాలలో ఉన్న మార్కెట్ లను పరిశీలించి అధ్యయనం చేయాలని మంత్రి మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆదేశించారు. అదేవిధంగా మత్స్యకారుల సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అర్హులైన మత్స్యకారులకు స్కిల్ టెస్ట్ లో అవసరమైన శిక్షణ ను ఇవ్వాలని చెప్పారు.

పశుసంవర్ధక శాఖపై సమీక్ష సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, అన్ని జిల్లాలలో గొర్రెలు, మేకల మార్కెట్ ల నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని డైరెక్టర్ రామచందర్ ను ఆదేశించారు. పెద్దపల్లి, ఖమ్మం, కామారెడ్డి తదితర జిల్లాలలో స్థలాలను గుర్తించడం జరిగిందని, అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, మిగిలిన జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టర్ ల సహకారంతో వారం రోజులలోగా స్థలాల సేకరణ చేపట్టాలని అన్నారు. పలు ప్రాంతాలలో ప్రకృతి వైపరిత్యాలతో జీవాలు మరణించి పెంపకందారులు ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని ఆదేశించారు. జీవాల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. ఎలాంటి వ్యాధుల భారిన పడకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సిన్ ల పంపిణీ, నట్టల నివారణ మందుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఏ సమయంలో ఏ జీవాలకు ఏ మందులు వేయాలో గుర్తించేలా హెల్త్ క్యాలెండర్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇటీవల పశువులు లంపి స్కిన్ వ్యాది బారినపడగా, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న తగు జాగ్రత్తల వలన అనతికాలంలోనే నివారించగాలిగాం అని చెప్పారు. రాష్ట్రంలోని 1880 గ్రామాలలో 9,317 పశువులు ఈ వ్యాధి భారిన పడగా, 66 పశువులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. వ్యాధి నివారణ కోసం 30.95 లక్షల పశువులకు టీకాలు వేసినట్లు, 1.85 కోట్ల రూపాయల వ్యయం చేసి అవసరమైన మందులను సరఫరా చేసినట్లు చెప్పారు. లంపి స్కిన్ బారినపడి రాజస్థాన్ లో 75,819 పశువులు, పంజాబ్ లో 17,932 పశువులు, మహారాష్ట్రలో 24,430 పశువులు, కర్నాటక లో 12,244 పశువులు మరణించాయని చెప్పారు.

గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని పిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గొర్రెలకు సకాలంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం వలన అవి ఆరోగ్యంగా ఉండి మాంసం ఉత్పత్తి పెరిగి పెంపకం దారుడికి ఆర్ధికంగా మేలు జరుగుతుందని అన్నారు. సంచార పశువైద్యశాలల (1962) ద్వారా జీవాలకు అందుతున్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని, రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రైతులు జీవాల కోసం అత్యధికంగా వినియోగించే మందులనే అందుబాటులో ఉంచి ఉచితంగా అందిస్తుండటం వలన ప్రైవేట్ మెడికల్ షాప్ లకు వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. శాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలలో గడ్డి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 19 కోట్ల రూపాయల వ్యయంతో 57 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రైనింగ్ సెంటర్ కు ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

పశు గణాభివృద్ధి సంస్థ సమీక్ష సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు గాను నాణ్యమైన పశుసంపద ఉత్పత్తి కోసం నిర్వహిస్తున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని చెప్పారు. ఇప్పటి వరకు 6,384 శిభిరాలను 12.77 లక్షల గర్బం దాల్చని పశువులను గుర్తించి తగు చికిత్స చేయడం జరిగిందని చెప్పారు. టీఎస్ఎల్డీఏ ఆధ్వర్యంలో 500 శిభిరాలు నిర్వహించి 11.97 లక్షల పశువులకు కృత్రిమ గర్భదారణ చేయగా, 3 లక్షల దూడలు పుట్టినట్లు చెప్పారు. గత సంవత్సరం డిసెంబర్ వరకు 16.20 లక్షల డోసుల పశువీర్యం ఉత్పత్తి చేయడం జరిగిందని తెలిపారు. పశువీర్యం (సెమెన్) నాణ్యతను పరీక్షించేందుకు గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ లోనే ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లి వద్ద నిర్మిస్తున్న పశువీర్య ఉత్పత్తి కోసం కేంద్రాన్ని మార్చిలో ప్రారంభించడం జరుగుతుందని, ఈలోగానే నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మాంసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాత్మకంగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒక అత్యాధునిక ఔట్ లెట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ రాంచందర్ ను మంత్రి తలసాని ఆదేశించారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకంతో పాటు జీవాలకు ఉచితంగా వైద్యం, మందులు, సబ్సిడీ పై దాణా, గడ్డి విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి పరంగా అన్ని రకాల లబ్ది పొందుతున్న రైతులు విజయ డెయిరీ కే పాలు పోసే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ పరిధిలోని వీబీఆర్ఐ ద్వారా జీవాలకు అవసరమైన 6 రకాల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. లంపి స్కిన్ వ్యాధి నివారణకు ఉపయోగించిన వ్యాక్సిన్ ను కూడా వీబీఆర్ఐ ద్వారానే ఉత్పత్తి చేయడం జరిగిందని చెప్పారు. మన రాష్ట్ర అవసరాలకు వినియోగించగా ఆంద్రప్రదేశ్, పంజాబ్, ఒరిస్సా, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు 2 కోట్లకు పైగా డోసులను విక్రయించడం ద్వారా 3.11 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో షీఫ్ ఫెడరేషన్, విజయ డెయిరీ చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 4 =