హైదరాబాద్ నగరంలో 137 లింక్ మిస్సింగ్ రోడ్ల‌ను నిర్మిస్తున్నాం – మంత్రి కేటిఆర్

Minister KTR, Talasani Srinivas Laid Foundation Stone for Railway Under Bridge at Sanath Nagar

హైద‌రాబాద్ ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేలా సమగ్రాభివృద్ధికి చేపట్టిన చర్యలలో భాగంగాట్రాఫిక్ స‌మ‌స్యను ప‌రిష్క‌రించుటకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల, పురపాలక శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు పేర్కొన్నారు. అందుక‌నుగుణంగా ప్ర‌ధాన రోడ్ల‌పై వాహ‌నాల ర‌ద్దీని త‌గ్గించుట‌కు న‌గ‌ర‌వ్యాప్తంగా 137 లింక్ మిస్సింగ్ రోడ్ల‌ను నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. మిస్సింగ్ లింక్ రోడ్ల‌కు ఎక్కువ మొత్తం లో ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ లింక్ రోడ్ల‌తో అన్ని ప్రాంతాల‌లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌యాణ సమయం, ఇంధ‌నం ఆదా అవుతుంద‌ని తెలిపారు.

స‌న‌త్‌న‌గ‌ర్-బాలాన‌గ‌ర్ పారిశ్రామిక ప్రాంతాల‌ను కలుపుతూ రూ.68.30 కోట్ల‌తో నిర్మించ‌నున్న నాలుగు లేన్ల రైల్వే అండ‌ర్ బ్రిడ్జి, ఫ‌తేన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ పై ఒత్తిడిని త‌గ్గించుట‌కు దానికి ప్యార్‌ల‌ల్‌గా రూ. 45 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న రెండు లేన్ల రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌కు రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో క‌లిసి మంత్రి కేటిఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, న‌గ‌రంలో ఏ ప‌నినైనా మొద‌ట‌గా స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుండే శ్రీ‌కారం చూడుతున్న‌ట్లు తెలిపారు. ఈ రైల్వే అండ‌ర్ బ్రిడ్జి నిర్మాణంతో స‌న‌త్‌న‌గ‌ర్, న‌ర్స‌పూర్ చౌర‌స్తా, జీడిమెట్ల మ‌ధ్య ప్ర‌యాణించే ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌కు రిలీఫ్ ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఈ రెండు ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయించాల‌ని హెచ్‌.ఆర్‌.డి.సి.ఎల్ అధికారుల‌ను ఆదేశించారు. బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని, మ‌రికొన్ని నెల‌ల్లో దీనిని ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ, స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దికి మంత్రి కేటిఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకొని నిధులు మంజూరు చేయిస్తున్న‌ట్లు తెలిపారు. ఏ నియోజ‌క‌వ‌ర్గానికి లేనివిధంగా స‌న‌త్‌న‌గ‌ర్ కు ప్ర‌త్యేక రిజ‌ర్వాయ‌ర్‌ను నిర్మించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియం ప‌నులు పూర్తి అయ్యాయ‌ని, త్వ‌ర‌లోనే దీనిని ప్ర‌జ‌ల వినియోగంలోకి తేనున్న‌ట్లు తెలిపారు. మ‌హా ప్ర‌స్థానానికి ధీటుగా బ‌ల్కంపేట శ్మ‌శాన‌వాటిక‌ను అభివృద్ది చేస్తున్న‌ట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో వైట్ టాపింగ్ రోడ్ల‌ను కూడా నిర్మించిన‌ట్లు తెలిపారు. ధీర్ఘ‌కాలంగా స‌న‌త్‌న‌గ‌ర్ ప్రాంత ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక‌గా ఉన్న రైల్వే అండ‌ర్ బ్రిడ్జి, ఫ్లైఓవ‌ర్ల‌ను మంజూరు చేసిన మంత్రి కేటిఆర్ కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల త‌రుపున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప‌రిస్థితుల్లో కూడా హైద‌రాబాద్ ను ప్ర‌పంచ స్థాయిలో అభివృద్దికి నిద‌ర్శ‌నంగా నిలిపేందుకు లింక్ రోడ్లు, స్కైవేలు, ఫ్లైఓవ‌ర్లు, రోడ్ల విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయిస్తున్న ఘ‌న‌త తెలంగాణ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని పేర్కొన్నారు. స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌వ‌క‌ర్గం అన్ని విధాలుగా వేగంగా అభివృద్ది చెందుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ కృషిని న‌గ‌ర ప్ర‌జ‌లు చిర‌స్థాయిగా గుర్తించుకుంటారని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =