సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం – మంత్రి తలసాని

2021 Ganesh Festival Celebrations, ganesh chaturthi, Ganesh Chaturthi 2021, Ganesh Chaturthi Festival Celebration, Ganesh Chaturthi Festival Celebration 2021, Ganesh Festival Celebrations, Ganesh Festival Celebrations 2021, Mango News, Minister Talasani Srinivas, Ministers Talasani Indrakaran Reddy, Ministers Talasani Indrakaran Reddy held Review Meeting on Ganesh Festival Celebrations, Ministers Talasani Indrakaran Reddy Review Meeting, Review Meeting on Ganesh Festival Celebrations, Talasani Review Meeting on Ganesh Festival Celebrations, talasani srinivas yadav

ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవరెడ్డి, బఘవంత రావు, ఖైరతాబాద్, బాలాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన గణేష్ మండప నిర్వహకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 10వ తేదీన విగ్రహాల ప్రతిష్టతో ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించే శోభాయాత్ర తో నిమజ్జనం కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వహకులు ఆయా ప్రాంతాలలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అలాంటి అధికారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వివరిస్తూ ఈ విషయం పై స్థానిక పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ లకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సమావేశంలో పాల్గొన్నడీజీపీ మహేందర్ రెడ్డి కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. నగరంలో ఎంతో ప్రసిద్ది గాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పూర్తిగా ద్వంసమైందని ఉత్సవ నిర్వహకులు సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతాన్ని సోమవారం నాడు సందర్శించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని జీహెఛ్ఎంసీ కమిషనర్ కు మంత్రి సూచించారు.

ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసు అధికారులు సహకరించాలని, క్రేన్ ను ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటి అద్యక్షులు సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. ఉప్పల్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల కు చెందిన విగ్రహాల నిమజ్జనం సమయంలో నిర్వహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి నిర్వాహకులతో పాటు ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 సంవత్సరం నిర్వహించిన ఉత్సవాలలో జీహెఛ్ఎంసీ పరిధిలో దాదాపు 33 వేల విగ్రహాలు ప్రతిష్టించడం జరిగిందని, ఈ ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ హోదాలలో దాదాపు 30 వేల మంది పోలీసులు విధులునిర్వహించారని ఆయన వివరించారు. మండపాల నుండి విగ్రహాలను తరలించేందుకు గాను, విగ్రహాల నిమజ్జనానికి 300 స్టాటిక్, మొబైల్ క్రేన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరిస్తూ ఈ ఏడాది కూడా గణేష్ ప్రతిమ ల సంఖ్య ను బట్టి వాటి నిమజ్జనానికి కావలసిన క్రేన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు.

హైదరాబాద్ లో నిర్వహించే ఈ గణేష్ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మతాల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇటీవల నిర్వహించిన బోనాల ఉత్సవాల తరహాలోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమాయత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాలను నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహకుల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అత్యధిక విగ్రహాలను నిమజ్జనం నిర్వహించే ప్రధానంగా హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, సఫిల్ గూడ, మీరాలం చెరువు తదితర చెరువులలో పూడిక తొలగింపు పనులను చేపట్టాలని నిర్వహకులు కోరిన మేరకు ఈ విషయంపై స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ను ఆదేశించారు. ఈ విషయంపై ఆయా జోనల కమిషనర్ లతో వెంటనే సమావేశం నిర్వహించి తగు విధంగా ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు.

అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన స్టాటిక్, మొబైల్ క్రేన్ లను అవసరమైన మేరకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. 3 షిఫ్ట్ లలో సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రధాన మండపాల వద్ద ఎలాంటి డ్రైనేజీ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే గణేష్ శోభాయాత్ర కు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విగ్రహాల ఊరేగింపు జరిగే రహదారులు, నిమజ్జనం ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం కోసం అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలతో పాటు అవసరమైన ప్రాంతాలలో అంబులెన్స్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు, విగ్రహాల ఊరేగింపు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. జీహెఛ్ఎంసీలోని జోనల్ కమిషనర్ లు, సర్కిల్ అధికారులను ఏర్పాట్ల విషయంలో అప్రమత్తం చేయాలని కమిషనర్ లోకేష్ కుమార్ ను మంత్రి ఆదేశించారు. ట్రాపిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో ఆర్ అండ్ బి శాఖ ఆధికారులు అవసరమైన ప్రాంతాలలో భారికేడ్ లను, జనరేటర్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లను అందుబాటులో ఉంచాలని ట్రాన్స్ కో అధికారులను మంత్రి ఆదేశించారు. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ తదితర ప్రధాన ప్రాంతాలలో బోట్స్, స్విమ్మర్ లను అందుబాటులో ఉంచాలని టూరిజం అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా హెఛ్ఎండీఏ ఆధ్వర్యంలో 70 వేలు, జీహెఛ్ఎంసీ ఆధ్వర్యంలో 50 వేలు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 40 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ నిర్వాహకుల కోరిక మేరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఆయా శాఖలకు చెందిన అధికారులు సిద్దంగా ఉండాలని, గతంలో కంటే ఈ సంవత్సరం ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందరు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి అన్ని మతాల పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రజాప్రతినిదులు , అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు అందరూ శాంతియుత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు జరిగేలా సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తామన్నారు. ఇండ్లలో కూడా మట్టి వినాయక విగ్రహలను ప్రతిష్టించి, పూజలు చేయాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించుకోవాలన్నారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఇటీవల బోనాల పండుగకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను ఇచ్చి ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. గణేష్ ఉత్సవాలకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, సురభి వాణిదేవి, దయానంద్ గుప్త, కాటేపల్లి జనార్ధన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి నీతూ కుమారి, హెఛ్ఎండీఏ కార్యదర్శి సంతోష్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ లు శర్మన్, అమయ్ కుమార్, ఇరిగేషన్ సీఈ శ్రీదేవి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నరసింహా రెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లు అంజని కుమార్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 7 =