హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1కు రుణం.. ఎస్‌బీఐ క్యాప్స్‌కు కీలక బాధ్యత

SBI Caps Ready To Handle Hyderabad Metro Phase-1 Loan Mobilisation at 4% Interest

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-1కు సంబంధించిన రుణ సమీకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. రుణ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎస్‌బీఐ క్యాప్స్‌ ఎల్‌1గా నిలిచింది. 4 శాతం వడ్డీ రేటుకే రుణాన్ని సమీకరించాలన్న ప్రభుత్వ షరతుకు సంస్థ అంగీకరించడంతో రుణ సేకరణ బాధ్యతలను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించనున్నారు.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1ను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎల్‌అండ్‌టీ పేరిట ఉన్న భారీ రుణాన్ని ప్రభుత్వం తన గ్యారెంటీ పరిధిలోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రూ.13,527 కోట్ల రీఫైనాన్సింగ్‌కు గతంలో ఒప్పందం కుదిరింది.

జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఏ) సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో 4 శాతం వడ్డీ రేటుకే రుణాన్ని సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా అప్పటివరకు 10.5-11 శాతం వరకు ఉన్న అధిక వడ్డీ భారాన్ని తగ్గించి, మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా మరింత స్థిరంగా మార్చాలని భావించింది.

అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ రుణ సమీకరణ ప్రక్రియ కొంతకాలంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రుణ సేకరణకు ప్రత్యేక ఏజెన్సీని ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో ఎస్‌బీఐ క్యాప్స్‌ ఎల్‌1గా నిలిచింది.

జేఐసీఏ-ఐఆర్‌ఎఫ్‌సీ ఒప్పందంలో ఉన్న తరహాలోనే రుణ చెల్లింపుల కాలవ్యవధి, ఇతర నిబంధనలు ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ షరతులను కూడా ఎస్‌బీఐ క్యాప్స్‌ అంగీకరించింది. దీంతో ఫేజ్‌-1 రుణ సమీకరణ ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఫేజ్‌-2పై కూడా ప్రభుత్వం దృష్టి

ఫేజ్‌-1 రుణ సమస్య పరిష్కారమైన వెంటనే హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 పనులను వేగంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెండో దశలో సుమారు 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాలను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సుమారు ఏడాదిన్నర క్రితమే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ, ఇంకా ఆమోదం రావాల్సి ఉంది.

ఫేజ్‌-1 రుణ సమీకరణ త్వరగా పూర్తయితే, ఫేజ్‌-2కు అవసరమైన నిధులు, అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేసి హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు మార్గం సుగమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here