ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. “ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ” అనేది తమ ప్రభుత్వ స్పష్టమైన విధానమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అమరావతి నిర్మాణం వల్ల వేలాది మంది రైతుల జీవితాలు మారాయని, భూముల ధరలు పెరిగి ఆ ప్రాంతం ఆర్థికంగా పుంజుకుందని పేర్కొన్నారు.
ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాజధానిని నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన ‘మూడు రాజధానుల’ విధానం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని లోకేశ్ ఈ సందర్భంగా ఎండగట్టారు. ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో కేవలం ఒక ప్యాలెస్ మాత్రమే కట్టుకున్నారని, అమరావతి కోసం పోరాడిన మహిళలను జుట్టు పట్టుకుని లాగడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత ఐదేళ్ల విధ్వంసం వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతం 25 శాతం పెట్టుబడులు వస్తున్నాయని, ఒకవేళ గత ప్రభుత్వం లేకపోయి ఉంటే అది 50 శాతానికి చేరేదని వివరించారు.
అనంతపురం జిల్లా అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, కియా పరిశ్రమ రాకతో ఆ జిల్లా అభివృద్ధిలో ఐదో స్థానానికి చేరిందని లోకేశ్ గుర్తుచేశారు. సీఎం దూరదృష్టి వల్ల రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వేగంగా విస్తరించాయని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రం గర్వపడేలా ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులను తీసుకువస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి రైతులకు అబద్ధం చెప్పి వారిని ఇబ్బందులకు గురిచేసినందుకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వ్యవస్థలు శాశ్వతంగా ఉండాలని, అందుకే అమరావతికి న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు ఈ తీర్మానం అత్యంత ఆవశ్యకమని లోకేశ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.







































