ప్రధాని మోదీని దూషిస్తే.. ఆ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా లేదు, కానీ తెలంగాణలో పెట్టాం – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Says, Cases Filed in Telangana Against Those Who Insulted PM Modi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వ్యాఖ్యలు, తెలంగాణ పోలీసు అధికారుల బదిలీలపై స్పందిస్తూనే, రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన కీలక విజ్ఞప్తులతో కేంద్ర మంత్రులను కలసి చర్చలు జరిపారు.

ప్రధానిపై వ్యాఖ్యల కేసు, డీసీపీ బదిలీపై స్పందన

ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా దూషించిన ఘటనలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, కానీ తెలంగాణలో తాము బాధ్యతాయుతంగా కేసు నమోదు చేశామని తెలిపారు. డీసీపీ బదిలీ వ్యవహారంలో చట్టానికి లోబడే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అధికారులను బదిలీ చేయడం అనేది రాజ్యాంగం ముఖ్యమంత్రికి కల్పించిన విచక్షణాధికారమని పేర్కొంటూ, ఈ అంశంపై విమర్శలు చేస్తున్న నాయకులకు పనీపాటా లేదని మండిపడ్డారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై విజ్ఞప్తి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 150 నుంచి 152 మీటర్లకు పెంచేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (CWPRS) అధ్యయనం ప్రకారం ఎత్తు పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని, పైగా 50 శాతం ముంపు నదీ గర్భంలోనే ఉంటుందని వివరించారు.

ఎత్తు పెంచడం వల్ల గ్రావిటీ ద్వారా నీటి సరఫరా జరిగి విద్యుత్ భారం తగ్గుతుందన్నారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులతో, ఆ తర్వాత మంత్రుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు

అలాగే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమై పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన స్పష్టతను గుర్తుచేస్తూ, ఇప్పటికే వేల కోట్లు వెచ్చించిన ఈ ప్రాజెక్టుల పనులు అనుమతులు లేక నిలిచిపోవడం వల్ల వ్యయం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రులతో జరిపిన ఈ సమావేశాల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పలువురు ఎంపీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here