ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా ‘ప్రజా రాజధాని’గా అభివర్ణించిన ఆయన, ఈ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు. ప్రాచీన కాలంలో శాతవాహనులు అమరావతి నుంచే పాలన సాగించారని, ఆనాటి వైభవానికి సంబంధించిన ఆధారాలు నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సవాళ్లను ప్రస్తావిస్తూ, అప్పట్లో సరైన కార్యాలయాలు లేక బస్సుల్లో ఉండి పరిపాలన సాగించామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అసెంబ్లీ, సచివాలయ భవనాలను పూర్తి చేసి రికార్డు సృష్టించామని తెలిపారు.
గతంలో తెలుగువారిని ‘మదరాసీలు’ అని పిలిచేవారని, టీడీపీ ఆవిర్భావం తర్వాతే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలన్నదే తన సంకల్పమని, హైదరాబాద్, అమరావతి నగరాలు దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతిపక్ష నేత వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ, గతంలో అమరావతికి మద్దతు తెలిపిన వ్యక్తి ఆ తర్వాత ఊసరవెల్లి రాజకీయాలు చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు తోటలకు నిప్పు పెట్టడమే కాకుండా, ప్రపంచ బ్యాంకుకు ఈమెయిల్స్ పంపి కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వంద ఎకరాల్లో భవనాలు కట్టడం రాజధాని అనిపించుకోదని, రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చేలా ఒక మహా నగరం ఉండాలన్న ఆలోచనతోనే అమరావతిని ఎంచుకున్నట్లు వివరించారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం కూడా 46 శాతం మంది విజయవాడ-గుంటూరు మధ్యే రాజధానిని కోరుకున్నారని ఆయన గుర్తుచేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. పవిత్రమైన మట్టి, నీరుతో పునీతమైన ఈ ప్రాంతం కలకాలం నిలుస్తుందని, ఏపీ సర్వతోముఖాభివృద్ధికి అమరావతి కేంద్రబిందువు అవుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.







































