ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో పదవులు మరియు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలను దూరం పెట్టే నాయకులను తాను కూడా దూరం పెడతానని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్తను, నేతను గుర్తించే బాధ్యతను లోకేశ్‌కు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. టీడీపీ ఒక బ్రాండ్ అని, ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన ప్రవర్తనతో ప్రజల మనసు గెలవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిపై తన సంకల్పాన్ని వివరిస్తూ, అమరావతిని ‘దేవతల రాజధాని’గా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. కొందరు రాక్షస ప్రవృత్తి ఉన్న వ్యక్తులకు ఇది ఇష్టం లేకపోయినా, ఇకపై ‘మూడు ముక్కలాట’కు తావులేదని, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని తేల్చి చెప్పారు.
2028 ఆగస్టు నాటికి అమరావతి పనులన్నీ పూర్తి చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కార్యకర్తలు గర్వంగా కాలర్ ఎగరేసేలా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తూ ‘సూపర్ సిక్స్’ పథకాలను సూపర్ హిట్ చేశామని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసాన్ని దాటుకుని 6.28 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచలేదని టీడీపీ అధినేత గుర్తుచేశారు.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని, పార్టీలో 50 శాతం సీట్లు పెరగనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టీడీపీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని, అభివృద్ధి అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని అన్నారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ టీడీపీవేనని, జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల త్యాగాల వల్లే నేడు పార్టీ ఈ స్థాయిలో ఉందని, వారి సంక్షేమం కోసం ట్రస్టు ద్వారా ఉచిత విద్య వంటి సేవలు అందిస్తున్నామని టీడీపీ అధినేత తెలిపారు.
ఈ వేడుకల సందర్భంగా కృష్ణా నదిలో మత్స్యకారులు నిర్వహించిన పడవల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ జెండాలతో అలంకరించిన బోట్లతో ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నిర్వహించిన ఈ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.






































