తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదైన అన్ని కేసులు కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 94 కేసులతో కలిపి జూన్ 1, సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2358 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
కొత్తగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియాలో 79 కేసులు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 3, మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలలో 2 చొప్పున, జనగామ, మహబూబాబాద్, పెద్దపల్లిలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 94 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 88 కి చేరినట్టు తెలిపారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 434 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 434 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,792 కి చేరింది. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1491 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1213 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu