ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ ఫలితాలు – సీఎం చంద్రబాబు

CM Chandrababu Applauds PM Modi’s Leadership as BJP Leads in West Bengal and Assam

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపులో వెల్లడవుతున్న ట్రెండ్స్ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి ప్రజలు అభివృద్ధికి, సుస్థిరతకు పట్టం కట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. ఓటర్ల తీర్పు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి దిక్సూచిలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో.. “ఈరోజు ఎన్డీఏ సాధించిన విజయం, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపైనా, వికసిత భారత్ కోసం ఆయనకున్న దార్శనికతపైనా ప్రజలకు ఉన్న నిరంతర, పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ స్ఫూర్తితో నడిచే ప్రజల ఆకాంక్షల సంగమంగా ఎన్డీఏను ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఫలితంతో వికసిత భారత్ దిశగా సాగే ప్రయాణం మరింత బలోపేతమైంది.”

“అభివృద్ధి పట్ల ఎన్డీఏకున్న అచంచలమైన నిబద్ధతకు ప్రజల విశ్వాసం, మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. యువ భారతదేశం విశ్వసనీయతకు, అభివృద్ధికి, పౌరులతో నిజమైన అనుబంధానికి విలువ ఇస్తుందనే సందేశాన్ని ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందిస్తోంది.”

“ఈ చారిత్రాత్మక తీర్పునకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారికి, ఎన్డీఏ విజేతలందరికీ, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here