భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. స్కైరూట్ సంస్థ ఈ నెలలో ‘మిషన్ ఆగమన్’ పేరిట ‘విక్రమ్-I’ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం ద్వారా దేశం గర్వించదగ్గ ముగ్గురు గొప్ప సైంటిస్టులకు సరికొత్త రీతిలో ఘన నివాళి తెలపడానికి సంస్థ సిద్ధమైంది. ‘విక్రమ్-I’ రాకెట్లో సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనున్నారు.
Flying alongside them: Cosmos Diamonds' artwork Cosmic Bloom, and a Microart by Ajay Kumar Mattewada — an 18K gold rocket holding micro-sculptures of Sir C.V. Raman, Dr. Vikram Sarabhai (Vikram-1's namesake), and Dr. A.P.J. Abdul Kalam, each smaller than a grain of rice. pic.twitter.com/gorfigyYCv
— Skyroot Aerospace (@SkyrootA) July 6, 2026
బంగారు రాకెట్లో బియ్యపు గింజ కంటే చిన్నవిగా..
భారతదేశాన్ని అంతరిక్ష, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ సూపర్ పవర్‌గా నిలిపిన ఆ ముగ్గురు మహానుభావుల గౌరవార్థం స్కైరూట్ ఈ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రఖ్యాత మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ 18 క్యారెట్ల బంగారంతో ఒక చిన్న రాకెట్ ఆకృతిని తయారు చేసి, అందులో ఈ ముగ్గురు సైంటిస్టుల విగ్రహాలను అత్యంత అద్భుతంగా చెక్కారు. ఈ విగ్రహాలు ఒక్కొక్కటి ఒక బియ్యపు గింజ కంటే చాలా చిన్నవిగా ఉండటం విశేషం. అంతరిక్ష చరిత్రలోనే అత్యంత అరుదైన సూక్ష్మ కళాఖండాల నివాళిగా ఇది నిలిచిపోనుంది.
కళ, సైన్స్ ల అపూర్వ సమ్మేళనం
ఈ ముగ్గురు సైంటిస్టుల సూక్ష్మ విగ్రహాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రముఖ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ ప్రత్యేకంగా తయారు చేసిన ‘కాస్మిక్ బ్లూమ్’ అనే అద్భుతమైన కళాఖండం కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. అల్యూమినియం బేస్ ప్లేట్‌పై అమర్చిన ఈ వజ్రాల ఆభరణాల సృష్టి శాస్త్ర సాంకేతిక రంగానికి, సృజనాత్మక కళకు ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పనుంది. ఈ నెలాఖరులో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ విక్రమ్-I రాకెట్ నింగిలోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది.
భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి మరో మైలురాయి
విక్రమ్-I ప్రయోగం స్కైరూట్ ఏరోస్పేస్కే కాకుండా భారత ప్రైవేట్ స్పేస్ పరిశ్రమకు కూడా కీలక మైలురాయిగా భావిస్తున్నారు. విజయవంతమైతే, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పే ఘట్టంగా ఈ ప్రయోగం నిలవనుంది. దేశ శాస్త్రవేత్తలకు వినూత్నంగా నివాళులర్పిస్తూ, విజ్ఞానం, సాంకేతికత, కళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ప్రత్యేక మిషన్‌గా ‘మిషన్ ఆగమన్’ గుర్తుండిపోనుంది.



































