మెట్రో ఫేజ్‌-2కు తక్షణమే ఆమోదం తెలపండి.. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు

CM Revanth Reddy Writes Letters To Union Ministers Khattar and Kishan Reddy Over Hyderabad Metro Expansion

హైదరాబాద్ మహానగర ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ (ఫేజ్‌-2), నిర్వహణ (ఫేజ్‌-1) అంశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఫేజ్‌-2 నిర్మాణానికి తక్షణమే పరిపాలన, ఆర్థిక ఆమోదాలు తెలపాలని, అలాగే ఫేజ్‌-1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలకు శనివారం ఆయన వేర్వేరుగా అత్యవసర లేఖలు రాశారు. మెట్రో ప్రాజెక్టు అమలులో జరిగే ఆలస్యం వల్ల ప్రతి నెలా ధరల పెరుగుదల, వడ్డీ భారం, నిర్మాణ సామగ్రి వ్యయం పెరిగి ప్రాజెక్టుపై రూ. వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్కటి కూడా అమల్లోకి రాలేదంటూ తీవ్ర అసంతృప్తి

గత జూన్ 23న రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, 24న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో.. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో జరిగిన కీలక సమావేశాలను లేఖలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 బదిలీ, ఫేజ్‌-2 విస్తరణపై ఎంతో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఇప్పటివరకు వాటిలో ఒక్కటి కూడా అమల్లోకి రాలేదంటూ రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ భేటీలో కుదిరిన అంగీకారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్‌బీఐ క్యాప్స్)కు మెట్రో ఫేజ్‌-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే రీఫైనాన్సింగ్ అవకాశాలను, ఫేజ్‌-2కు అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణకు సమగ్ర ఆర్థిక వ్యూహాన్ని కూడా అదే సంస్థ రూపకల్పన చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రక్రియ కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను వెంటనే ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.

జాప్యంతో భారీ మూల్యం

జూన్‌లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఎస్‌బీఐ క్యాప్స్‌ను కేంద్రం అధికారికంగా నియమించకపోవడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి పంపకపోవడంతో మెట్రో ఫేజ్‌-1 బదిలీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని, ఇది రోజువారీ నిర్వహణలోనూ ఇబ్బందులకు దారితీస్తోందని తెలిపారు. ఎస్‌బీఐ క్యాప్స్ నియామకం ఆలస్యం కావడం వల్ల మెట్రో ఫేజ్‌-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (DPR) కేంద్ర అనుమతులు కూడా నిలిచిపోయాయని చెప్పారు.

ప్రాజెక్టు ఆలస్యమయ్యే ప్రతి నెలా రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మునిసిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించినందున, కేంద్రం వైపు నుంచి ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని కోరారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత జోక్యం అవసరం

హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల్లోనే ఉందని, ఆయన వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫైళ్లను ముందుకు కదిలించేందుకు స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్‌-1 తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కావడం, ఫేజ్‌-2 వేగంగా అమలైతే నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత బлоకేతం అవ్వడమే కాకుండా హైదరాబాద్‌ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ముఖ్యమంత్రి తన లేఖలో స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here