తెలంగాణ ఆర్థిక ప్రగతిపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించడం పట్ల మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రంగా అవతరించిందంటూ ప్రపంచబ్యాంకు విడుదల చేసిన తాజా నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ నివేదికే చెంపపెట్టు అని సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
దేశవ్యాప్తంగా ఈ అరుదైన హోదాను దక్కించుకున్న కేవలం ఐదు అగ్ర రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నిలవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో జరిగిన సమగ్ర అభివృద్ధి, పటిష్టమైన ఆర్థిక విధానాల వల్లే రాష్ట్రం నేడు ఈ స్థాయికి చేరుకుందని స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రించాలని చూస్తున్నాయని, కానీ అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం తెలంగాణ సఫల, సంపన్న రాష్ట్రంగా సగర్వంగా నిలిచిందని ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రాసుకొచ్చారు.
తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది!
సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించింది!
తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్ కం బెంచ్ మార్క్ ను దాటి ఎదిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది!
దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ వుండటం మనకు… pic.twitter.com/3Tw7dKYOHQ
— KTR (@KTRBRS) July 8, 2026






































