కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రేపు (గురువారం) రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన 8 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత హైకమాండ్ ప్రతిపాదనలకు నిరాకరించిన సిద్ధరామయ్య, చివరకు అధిష్ఠానం ఒత్తిడి మరియు రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రత్యక్ష సందేశంతో దిగివచ్చి పదవిని వదులుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం.
రాజీనామాకు సిద్ధరామయ్య గ్రీన్ సిగ్నల్
దిల్లీలో జరిగిన సుదీర్ఘ మంతనాల తర్వాత సిద్ధరామయ్య తన పదవిని వదులుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. గురువారం (మే 28న) మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉంది. అంతకంటే ముందు గురువారం ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో ఆయన క్యాబినెట్ సహచరులతో అత్యవసర బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశాన్ని నిర్వహించి తదుపరి నిర్ణయాలను తీసుకోనున్నారు. అధిష్ఠానం సిద్ధరామయ్యకు కేంద్ర పార్టీ సంస్థలో కీలక బాధ్యతలతో పాటు రాజ్యసభ స్థానాన్ని కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
డీకేకు చెక్ పెట్టేలా సిద్ధు కొత్త మెలిక
తాను రాజీనామా చేయడానికి అంగీకరించినప్పటికీ, సిద్ధరామయ్య అధిష్ఠానం ముందు ఒక సరికొత్త ప్రతిపాదనను ఉంచారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ‘అహింద’ (వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దళితులు) వర్గానికి చెందిన నేతకే ముఖ్యమంత్రి పీఠాన్ని కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఈ ప్రతిపాదనకు గనుక హైకమాండ్ ఓకే చెబితే, ప్రస్తుతం రేసులో ఉన్న దళిత నేత, రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్‌కు సీఎం అయ్యే అవకాశాలు దక్కుతాయి. దీనివల్ల ముఖ్యమంత్రి పదవి కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్‌కు గట్టి చెక్ పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పైకి కొట్టిపారేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ పగ్గాలు చేపడతారా లేక సిద్ధు వ్యూహం ప్రకారం పరమేశ్వర్‌కు లక్ కలిసి వస్తుందా అనేది రాబోయే 24 గంటల్లో తేలనుంది.







































