ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి, అక్కడి సిబ్బంది సంక్షేమానికి సంబంధించి చారిత్రాత్మకమైన సంచలన నిర్ణయాలు తీసుకుంది. గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ, వాటికి పూర్తి స్వతంత్రతను కల్పించేలా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ధనసరి సీతక్క మరియు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీ ఆదాయంపై ప్రభుత్వ పెత్తనానికి చెక్
గ్రామ పంచాయతీలు తమకు వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీల్లో (ఖజానాలో) జమ చేసి, మళ్లీ డ్రా చేసుకునే పాత పద్ధతికి ప్రజా ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లోనే వేసుకుని వాడుకునేందుకు అనుమతిస్తూ అధికారులు చేసిన సూచనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
గత ప్రభుత్వం ట్రెజరీ నిబంధనను తీసుకువచ్చి పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానాన్ని మార్చడం కోసం ‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018’ లోని సెక్షన్ 70(3)కు తగిన సవరణలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల నిధుల కొరత లేకుండా గ్రామాల్లో తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం సర్పంచులు, కార్యదర్శులకు లభిస్తుంది.
ఒకటో తేదీనే 50 వేల మంది పంచాయతీ సిబ్బందికి జీతాలు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది మల్టీపర్పస్ కార్మికులు, ఇతర సిబ్బందికి ఇకపై ఐఏఎస్ అధికారులతో సమానంగా ప్రతి నెలా ఒకటో తేదీనే పక్కాగా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా అందరికీ ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని, ఇందులో ఒక్క రోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇందుకోసం ప్రభుత్వం తరఫున వాటాగా ప్రతి నెలా రూ.50 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా దశాబ్దాలుగా వేతనాల ఆలస్యంతో ఇబ్బంది పడుతున్న గ్రామీణ కార్మికులకు పెద్ద ఊరట లభించింది.
బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్లు.. ఒంటరి మహిళలకు టాప్ ప్రయారిటీ
రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ విధానంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుతం పోస్టల్ శాఖ (పోస్టాఫీస్) ద్వారా జరుగుతున్న పెన్షన్ల చెల్లింపుల పద్ధతిని పూర్తిగా నిలిపివేసి, ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఓటర్ ఐడీ, ఆధార్, ఎస్‌ఈఈఈపీసీ డేటా ఆధారంగా అర్హులైన వారికే పెన్షన్లు అందేలా క్రమబద్ధీకరించాలని సూచించారు. అలాగే, కొత్తగా మంజూరు చేసే పెన్షన్ల జాబితాలో ఒంటరి మహిళలకే మొదటి ప్రాధాన్యత (ఫస్ట్ ప్రయారిటీ) ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.






































