రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా..? తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ఆవేదన

CM Vijay Gets Emotional in Assembly Over Karur Stampede Incident, Slams Opposition Politics

తమిళనాడు శాసనసభ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ రణరంగం ముదిరింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వర్సెస్ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగిన మాటల యుద్ధం సభలో ఊహించని ఉద్రిక్తతలకు దారితీసింది.

గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి చేసిన పదునైన వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా హీటెక్కింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగనున్న తమ ఐదేళ్ల నూతన పాలనా విధానంపై ఈ అత్యున్నత వేదికగా పటిష్టమైన సంకల్పాన్ని చాటారు.

ఒకే కుటుంబం కాదు.. ప్రతి కుటుంబం మాదే

సభలో ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తమిళనాడులో అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా, ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా సరే వారిని వదిలే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్క కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం తమ రాజకీయ విధానం కాదని, డీఎంకేను ఉద్దేశిస్తూ గట్టి చురకలు అంటించారు. తమిళనాడులోని ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ లబ్ధి చేకూర్చడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విజయ్ ఉద్ఘాటించారు.

సీఎం విజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్న డీఎంకే ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి నేరుగా గత పాలకులను టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు చేయడంతో ప్రతిపక్ష డీఎంకే (DMK) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు ఒకేసారి లేచి సీఎం ప్రసంగాన్ని అడ్డుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కేవలం రాజకీయ కక్షతో, బురదజల్లేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే దానికి సంబంధించిన పక్కా ఆధారాలను సభ ముందు ఉంచాలని ఉదయనిధి స్టాలిన్ గట్టిగా డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

కరోర్ తొక్కిసలాటపై భావోద్వేగం.. కేంద్రంతో సయోధ్యపై స్పష్టత

ఎన్నికల ప్రచారంలో జరిగిన దురదృష్టకర కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సీఎం విజయ్ సభలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది, ఆ బాధ నా గుండెల్లోంచి ఎప్పటికీ పోదు” అని ఆవేదన చెందారు. ఆ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తూ తమపైనే నిందలు వేయడంపై ధ్వజమెత్తుతూ.. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా? అని ప్రశ్నించారు. మేం అధికారంలోకి వచ్చి కేవలం కొన్ని రోజులే అవుతోందని, అప్పుడే బురదజల్లడం ఏంటని మండిపడ్డారు.

ఇదే వేదికగా కేంద్ర ప్రభుత్వంతో తమ బంధంపై సీఎం కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావలసిన నిధుల కేటాయింపుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో తాము సయోధ్యగానే ఉంటామని స్పష్టం చేశారు. అయితే, సిద్ధాంతపరంగా మాత్రం తాము బీజేపీ (BJP) విధానాలను, వారి ఐడియాలజీని పూర్తిగా వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి విజయ్ సభ ముఖంగా తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here