నీట్ (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరీక్షల భద్రత కోసం టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ చట్టం (IT Act) సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ వినియోగాన్ని తాత్కాలికంగా నియంత్రించనున్నారు.
మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై జూన్ 30 వరకు నిషేధం
పరీక్ష ముగిసిన తర్వాత నకిలీ ‘పేపర్ లీక్’ ఆధారాలను సృష్టించే ముఠాల వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మరో కీలక ఆదేశం ఇచ్చింది. టెలిగ్రామ్ యాప్‌లో ఈనెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. సాధారణంగా టెలిగ్రామ్‌లో పాత మెసేజ్‌లను ఎడిట్ చేసినప్పుడు పాత టైమ్‌స్టాంప్ (పాత తేదీ, సమయం) అలాగే ఉంటుంది.
దీనిని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పరీక్ష ముగిసిన తర్వాత పాత పోస్టులను ఎడిట్ చేసి, అందులో అసలు ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేసి పరీక్షకు ముందే లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారు. ఈ లూప్‌హోల్‌ను అడ్డుకోవడానికే ఈ ప్రత్యేక ఫీచర్‌ను తాత్కాలికంగా బ్యాన్ చేశారు.
అంతర్రాష్ట్ర ముఠాల అరెస్ట్.. ఎన్టీఏ హెచ్చరికలు
పేపర్ లీక్ పేరుతో అమాయక విద్యార్థులను, తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న నకిలీ టెలిగ్రామ్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ విభాగాలు గట్టి నిఘా పెట్టాయి. ఇందులో భాగంగానే అహ్మదాబాద్‌లో ‘పేపర్ లీక్డ్ నీట్’, ‘ప్రైవేట్ మాఫియా’ వంటి పేర్లతో 8 నకిలీ టెలిగ్రామ్ ఛానళ్లను నడుపుతూ దాదాపు రూ. 1.5 కోట్ల మోసాలకు పాల్పడిన ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసుల నుంచి వచ్చిన పక్కా సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించారు.
జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు సోషల్ మీడియాలో వస్తున్న అన్ని రకాల లీకేజీ వార్తలను ఎన్టీఏ (NTA) తీవ్రంగా ఖండించింది. అవన్నీ కేవలం విద్యార్థులను బురిడీ కొట్టించేందుకు కేటుగాళ్లు సృష్టించిన తప్పుడు ప్రచారాలేనని స్పష్టం చేసింది. పరీక్షా పత్రాల భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉందని, విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించింది. ఎవరైనా ఇలాంటి మోసపూరిత వసూళ్లకు పాల్పడితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.




































