పద్మభూషణ్ అందుకున్న డాక్టర్ నోరి, మమ్ముట్టి.. మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు పద్మశ్రీ

Padma Awards 2026 President Murmu Confers Top Civilian Honours, PM Modi Attends

రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో మంగళవారం రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను అందజేశారు.

ఈ అత్యున్నత స్థాయి పురస్కారాల ప్రధానోత్సవ వేడుకకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు అంతర్జాతీయ దౌత్యవేత్తలు హాజరయ్యారు.

2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించగా, గత మే 25న తొలి విడతలో 66 మందికి అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం జరిగిన రెండో విడతలో మిగిలిన 65 మంది ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయడం ద్వారా దేశ ప్రగతిలో వారి భాగస్వామ్యాన్ని కొనియాడుతూ తమ పటిష్టమైన సంకల్పాన్ని చాటారు.

నోరి దత్తాత్రేయుడు, మమ్ముట్టిలకు పద్మభూషణ్

ఈ విడత అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్, ప్రముఖ మలయాళ జర్నలిస్టు పి. నారాయణన్‌లు దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.

క్యాన్సర్ వైద్య రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి మరియు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాజ్ఞిక్‌తో పాటు మరో ముగ్గురు దిగ్గజాలకు ‘పద్మభూషణ్’ పురస్కారాలను అందజేశారు. వైద్య మరియు కళా రంగాలకు వారు చేసిన అసమాన సేవలకు గాను ఈ ఉన్నత గౌరవం దక్కింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ.. రోహిత్ శర్మకు పురస్కారం

రెండో విడతలో మొత్తం ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి పద్మభూషణ్ మరియు 57 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి ఆరుగురు ప్రముఖులు పద్మశ్రీ పురస్కారాలను అందుకోవడం విశేషం. టాలీవుడ్ సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లతో పాటు చంద్రమౌళి గడ్డమణుగు, కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, రామారెడ్డి మామిడి (మరణానంతరం) ఈ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించారు.

వీరితో పాటు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రముఖ బహుభాషా నటుడు ఆర్. మాధవన్ కూడా రాష్ట్రపతి భవన్‌లో పద్మశ్రీ పురస్కారాలను అందుకొని సగర్వంగా నిలిచారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంతో దేశ రాజధానిలో పండుగ వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here