ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మెగా క్యాబినెట్ భేటీ ద్వారా సుమారు 30 వేల మంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు మరియు 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు అత్యంత భారీ ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగ సమాజం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డిమాండ్లను పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికగా ఉద్యోగుల సంక్షేమంపై తమ పటిష్టమైన సంకల్పాన్ని చాటింది.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), గురుకుల విద్యా సంస్థలు మరియు వివిధ ప్రభుత్వ సొసైటీలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఉద్యోగులు అదనంగా రెండేళ్ల పాటు సేవలందించే అవకాశం లభించింది. చాలా కాలంగా నలిగుతున్న ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఉద్యోగ వర్గాలలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యెక్తం అవుతున్నాయి.
11 వేల మందికి సీపీఎస్ నుండి పాత పెన్షన్ విధానం (OPS) అమలు
ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. మెమో నెంబర్ 57 ప్రకారం.. 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో నియమితులై, ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (Old Pension Scheme) పునరుద్ధరించేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సుదీర్ఘ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, ఉద్యోగుల గ్రాడ్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడానికి కూడా సర్కార్ అంగీకరించింది.
ప్రభుత్వ నిర్ణయంపై సీపీఎస్ అసోసియేషన్ కృతజ్ఞతల వెల్లువ
రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ అత్యంత ఘనంగా స్వాగతించింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్‌పై స్పష్టతనిస్తూ ఓం నెం. 57 ని అమలు చేయడంపై అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపించినందుకు గాను సీఎం చంద్రబాబు మరియు రాష్ట్ర మంత్రి లోకేశ్‌కు అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయాల తాలూకు నిధుల కేటాయింపులతో రాష్ట్ర ఖజానాపై పడే అదనపు ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది.






































