కల్వకుంట్ల కవితకు షాక్.. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు మార్చాలంటూ ఈసీ ఆదేశాలు

EC Seeks Alternative Names For Kavitha's New Party Telangana Rakshana Sena

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్థాపించాలనుకుంటున్న ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు అందాయని పేర్కొంటూ, ఆ పేరును మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కవితకు అధికారికంగా లేఖ పంపింది.

ఎన్నికల సంఘం సూచనల ప్రకారం, ప్రస్తుతం ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే, రాబోయే 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సమర్పించాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించకపోతే, పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.

ఈ పరిణామాలపై స్పందించిన కల్వకుంట్ల కవిత, ఎన్నికల సంఘం సూచించినట్లుగా కొత్త పేర్లు సమర్పించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ పేరుపై ఈసీ లేవనెత్తిన రెండు ప్రధాన అభ్యంతరాలకు ఇప్పటికే సమగ్ర వివరణ ఇచ్చామని తెలిపారు.

చట్టంలోని అన్ని నిబంధనలను పాటించే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశామని, ఎన్నికల సంఘం నిర్ణయం న్యాయపరంగా సవాల్ చేయాల్సిన పరిస్థితి వస్తే వెనుకాడబోమని కవిత పేర్కొన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

అధికార వర్గాల సమాచారం ప్రకారం, గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి (మాజీ తెలంగాణ రాష్ట్ర సమితి) సంక్షిప్త నామమైన TRSతో కొత్త పార్టీ సంక్షిప్త నామం ఒకేలా ఉండటం, అలాగే ప్రజల్లో గందరగోళానికి అవకాశం ఉండటమే ఎన్నికల సంఘం అభ్యంతరాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రజల నుంచి కూడా పలు అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు సమాచారం.

ఇప్పుడు కవిత ఎన్నికల సంఘానికి ప్రత్యామ్నాయ పేర్లు సమర్పిస్తారా? లేక నేరుగా న్యాయపోరాటానికి వెళ్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పు, ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయాల ఆధారంగానే తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్ భవిష్యత్తు తేలే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here