ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రీక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌కు భారీ షాక్ తగిలింది. నార్వేతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2-1 తేడాతో ఓటమిపాలైన ఐదుసార్ల ప్రపంచ ఛాంపియన్ టోర్నీకి వీడ్కోలు పలికింది. ఇక ఈ సంచలన విజయం ద్వారా నార్వే క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఈ పరాజయం అనంతరం బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ సంచలన ప్రకటన చేశాడు.
ఓటమి నిర్వేదంలో అతడు ఏకంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 2010లో ప్రారంభమైన నెయ్‌మార్ 16 ఏళ్ల అంతర్జాతీయ ప్రయాణానికి తెరపడినట్టయింది. విశేషమేమిటంటే.. 2010లో బ్రెజిల్ తరఫున అరంగేట్రం చేసిన మెట్‌లైఫ్ స్టేడియంలోనే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా ఆడాడు.
Vinícius dándole un beso a Neymar y tratando de animarlo.
Durísimo 💔pic.twitter.com/CbTEqUaqLD
— (fan) REAL MADRID FANS 🤍 (@AdriRM33) July 5, 2026
పెనాల్టీ గోల్ చేసినా ఫలితం లేకపోయింది
నార్వేతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన నెయ్‌మార్ ఇంజూరీ టైమ్‌లో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచాడు. అయితే అప్పటికే నార్వే ఆధిక్యంలో ఉండటంతో ఆ గోల్ బ్రెజిల్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలోనే భావోద్వేగానికి గురైన నెయ్‌మార్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. “దేశం కోసం శక్తిమేర ప్రయత్నించాను.. నా ప్రయాణం మొదలైన చోటే ముగిసింది” అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
బ్రెజిల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు
బ్రెజిల్ జెర్సీలో 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నెయ్‌మార్ 80 గోల్స్‌తో ఆ దేశ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు ప్రపంచకప్‌ల్లో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు తన అంతర్జాతీయ కెరీర్‌లో 2013 కాన్ఫెడరేషన్స్ కప్‌ను మాత్రమే గెలుచుకోగలిగాడు. అయితే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు నెయ్‌మార్.
హాలాండ్ డబుల్‌తో నార్వే చరిత్ర సృష్టించింది
ఈ మ్యాచ్‌లో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ రెండు అద్భుత గోల్స్‌తో విజృంభించి తన జట్టును చరిత్రలో తొలిసారి ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు ప్రథమార్ధంలో బ్రెజిల్‌కు లభించిన పెనాల్టీని బ్రూనో గిమరాయెస్ చేజార్చుకోవడం జట్టుకు భారీ నష్టంగా మారింది. 2002 ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచిన తర్వాత, వరల్డ్ కప్ నాకౌట్ దశలో యూరోపియన్ జట్లపై బ్రెజిల్ విజయాన్ని నమోదు చేయలేకపోగా, ఈ ఓటమితో ఆ రికార్డు కొనసాగినట్టయింది.






































