ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల డైట్ చార్జీలను 10 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన డైట్ చార్జీల అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ఆర్థిక శాఖ అధికారులు సూచించినప్పటికీ, సీఎం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ చార్జీలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యే పేద కుటుంబాల అభివృద్ధికి శాశ్వత మార్గమని ఆయన పేర్కొన్నారు.
హాస్టళ్ల స్థానంలో ఆధునిక గురుకులాలు
రాష్ట్రంలో ఇకపై సంప్రదాయ హాస్టళ్ల నిర్మాణానికి బదులుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక గురుకులాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని చెప్పారు.
గురుకులాలను బయోడైవర్సిటీ పార్కుల తరహాలో పచ్చదనంతో తీర్చిదిద్దాలని, పర్యావరణహిత ‘నెట్ జీరో’ విధానాలను అమలు చేసే అవకాశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
హాస్టళ్ల మరమ్మతులకు రూ.100 కోట్ల ప్రత్యేక నిధి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రూ.100 కోట్ల ప్రత్యేక గ్రాంట్ ప్రకటించారు. ఈ నిధులతో అత్యవసర మరమ్మతులు, భవనాల నిర్వహణ, విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను కల్పించనున్నారు.
IIT, NIT, NEETకు ఉచిత కోచింగ్
సంక్షేమ శాఖల పరిధిలో చదువుతున్న విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ప్రతిభావంతులైన ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం IIT, NIT, NEET ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ కేంద్రాల్లో నాణ్యమైన అధ్యాపకులను నియమించి, కార్పొరేట్ స్థాయి కోచింగ్ అందించాలని సూచించారు. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని స్పష్టం చేశారు.
ప్రతి హాస్టల్లో మెడికల్ వింగ్
హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక మెడికల్ వింగ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థుల సహకారం
ప్రభుత్వ గురుకులాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థుల సహకారాన్ని వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. గురుకులాలను దత్తత తీసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. విద్యా, వైద్య రంగాల్లో సేవలు అందించేందుకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
సంక్షేమం నుంచి స్వయం సమృద్ధి వైపు
పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాల కల్పన కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. MEPMA, DWCRA, P4 వంటి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సంక్షేమంతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.




































