ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసింది. సోమవారం పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం.. అధికారులతో సమీక్ష నిర్వహించి పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పోలవరం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల
పోలవరం ఎడమ కాలువ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 14న ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నీరు అనకాపల్లి జిల్లాకు చేరుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖండ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రాజెక్టు పనులకు స్పష్టమైన గడువు
పోలవరం ప్రధాన డ్యామ్తో పాటు ఎడమ కాలువ అనుసంధాన పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టి నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.
వెలిగొండ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్
శ్రీశైలం జలాశయానికి వరదనీటి లభ్యతను బట్టి సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేసి రైతులకు శాశ్వత నీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
960 మెగావాట్ల జలవిద్యుత్పై దృష్టి
పోలవరం ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజ్ విధానం ద్వారా 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు అవసరమైన సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు.
భూసేకరణ, పునరావాసానికి ప్రాధాన్యం
ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ముంపు బాధితులకు పునరావాసం, పునరుద్ధరణ (R&R) ప్యాకేజీని కూడా 2027 మార్చి నాటికి పూర్తిచేసేలా అవసరమైన నిధులను విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
లక్షల ఎకరాలకు సాగునీరు.. విశాఖకు తాగునీటి భరోసా
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభించనుంది. కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, ఇప్పటికే ఉన్న 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాకుండా విశాఖపట్నం సహా పరిసర ప్రాంతాల్లోని సుమారు 28.5 లక్షల మంది ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపడనుంది. పరిశ్రమలకు 23.44 టీఎంసీల నీటి కేటాయింపు ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కూడా కొత్త ఊపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.






































