ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి, పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వినూత్న విద్యా సంస్కరణలను ఈ సందర్భంగా ప్రారంభించారు. సమాజ నిర్మాణంలో మరియు నాణ్యమైన విద్యనందించడంలో ఉపాధ్యాయులే మూలస్తంభాలని ముఖ్యమంత్రి కొనియాడారు.
తండ్రి కాళ్ళు మొక్కిన మంత్రి లోకేష్
ఇక ఈ సందర్భంగా ఒక సన్నివేశం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలని నిర్వాహకులు సూచించిన నేపథ్యంలో సభా వేదికపై మంత్రి లోకేష్ గౌరవసూచకంగా తన తండ్రి, సీఎం చంద్రబాబు నాయుడు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రీకొడుకులు ఒకే వేదికపై ఉండటం.. అందులోనూ ఒకరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కావడం, అలాగే మరొకరు విద్యాశాఖకు మంత్రి కావడంతో ఇది అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
పాఠశాల పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించిన ప్రధాన విద్యా సంస్కరణలు మరియు ముఖ్యాంశాలు..
విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే మూలస్తంభం
ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, వారి కృషి వల్లే నాణ్యమైన విద్యా బోధన సాధ్యమవుతుందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా సమావేశమై పిల్లల చదువు, మానసిక వికాసం మరియు ప్రవర్తనపై చర్చించాలని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని వివరించారు.
బాలికల ఆరోగ్యం కోసం ‘శుచి’ పథకం పునరుద్ధరణ
పాఠశాల విద్యార్థినుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ‘శుచి’ (Suchi) పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థినులు పడిన ఇబ్బందులను గుర్తుచేస్తూ, ఆడపిల్లల ఆరోగ్యం మరియు విద్యా వికాసానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలను వేగవంతం చేసి, రాబోయే రోజుల్లో ఏపీ విద్యా రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంకా విద్యార్థులకు పుస్తకాల భారాన్ని తప్పించేందుకు ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.






































