జాతీయ గేయమైన ‘వందేమాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో మరింత చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో కొత్త సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. 1971 నాటి ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్’లో మార్పులు ప్రతిపాదిస్తూ రూపొందించిన ఈ బిల్లులో కీలక మార్పులు చేశారు.
వందేమాతరం గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ఆలాపనను అడ్డుకోవడం లేదా గేయం పాడుతున్న సమయంలో అంతరాయం కల్పించడం వంటి చర్యలను శిక్షార్హ నేరాలుగా పరిగణించేలా ప్రత్యేక నిబంధనలు ప్రతిపాదించారు. జాతీయ గేయానికి తగిన గౌరవం, రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
బిల్లుపై ప్రతిపక్షాల అభ్యంతరాలు
ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా కొన్ని నిబంధనలు ఉన్నాయని విమర్శించాయి. సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ, స్వాతంత్ర్య సమరంలో వందేమాతరం పాత్రను గౌరవిస్తున్నప్పటికీ, కొత్త చట్టం వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. బిల్లును పునఃపరిశీలించాలని, విస్తృత చర్చ అనంతరమే ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో రాజ్యసభను వాయిదా వేశారు.
వందేమాతరం గౌరవమే లక్ష్యమన్న బీజేపీ
ఈ బిల్లును భారతీయ జనతా పార్టీ సమర్థించింది. జాతీయ గేయానికి తగిన గౌరవాన్ని పరిరక్షించేందుకు ఈ చట్టసవరణ అవసరమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సేథ్ పేర్కొన్నారు. గతంలో వందేమాతరం కొన్ని చరణాలకే పరిమితమైందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆలపిస్తున్నారని గుర్తు చేశారు. జాతీయ చిహ్నాల గౌరవాన్ని కాపాడే దిశగా ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, బిల్లుపై పార్లమెంట్‌లో మరింత విస్తృత చర్చ జరిగే అవకాశముంది.






































