జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షా పత్రాల లీకేజీ వివాదం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించినట్లు తెలిపారు. రాజధాని ఢిల్లీ వేదికగా గత కొన్నిరోజుల నుండి విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన విమర్శలు, పారదర్శకతపై నెలకొన్న సందేహాల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం దేశ రాజకీయాలతో పాటు విద్యా రంగంలోనూ కీలక పరిణామంగా మారింది.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
నీట్ వివాదం మరియు ఆందోళనల నేపథ్యం
దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షల్లో పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణను సీబీఐ (CBI)కి అప్పగించడంతో పాటు, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT Mode) పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరియు వివిధ ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టాయి.
లేఖలో ప్రధాన్ భావోద్వేగ వ్యాఖ్యలు
తన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతను, విద్యార్థులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యా సంస్కరణల కోసం తాను అంకితభావంతో పనిచేస్తున్నానని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద ఏర్పడిన పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకూడదని, దేశ సమైక్యత దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వైదొలుగుతున్నట్లు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, పరీక్షల మాఫియా వల్ల ఏ ప్రతిభావంతుడికి అన్యాయం జరగకూడదన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణలకు హామీ
పోటీ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన ‘పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం’ తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా పరీక్షల పారదర్శకతను పెంచేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలు అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యాశాఖలో చేపట్టబోయే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.







































