చట్టసభలకు పోటీ చేసే కనీస వయసు 21 ఏళ్లకు తగ్గించాలి – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన

CM Revanth Reddy Urges PM Modi To Reduce Minimum Contesting Age 21 For Elections

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసుపై కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడుతూ, లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలకు పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల వయసు పరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు.

ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులోనే ఈ ‘యువతరం’ అంశాన్ని కూడా చేర్చి ఒకే సమగ్ర బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఏర్పాటు చేసి విస్తృత చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్‌లు అయినప్పుడు రాజకీయంలో ఎందుకు వద్దు?

నేటి యువత ప్రతిభ, ఆలోచనా సరళిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. “స్వాతంత్య్రం వచ్చిననాటి పరిస్థితుల ప్రకారం చట్టసభల పోటీకి 25 ఏళ్లుగా నిర్ణయించారు, కానీ ఇప్పుడు విద్యావ్యాప్తి, సాంకేతికత పెరిగిన నేటి కాలంలో 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవుతున్నారు, యూనికార్న్ కంపెనీలు స్థాపించి వేల కోట్ల వ్యాపారాలను, ఫార్చ్యూన్-500 సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారు” అని గుర్తుచేశారు.

అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్ రంగాల్లో తమ సత్తా చాటుతున్న యువతకు దేశానికి ప్రాతినిధ్యం వహించే రాజకీయాల్లో అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. వీధుల్లో పోరాటాలు చేసిన యువత ఇకపై పార్లమెంట్‌లోకి అడుగుపెట్టి దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటోందని పేర్కొన్నారు.

శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం

చట్టసభల్లో పోటీ వయసును తగ్గించే అంశానికి సంబంధించి ఆగస్టులో తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో అన్ని ప్రతిపక్షాలతో సమగ్రంగా చర్చించి, లోక్‌సభ, శాసనసభలకు కనీస వయసును 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభలకు 25 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని స్పష్టం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తామని చెప్పారు.

ప్రజాభీష్టాన్ని కాదని నినాదాలతో పాలించలేరు

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరుపై ఈ సందర్భంగా సీఎం విమర్శలు గుప్పించారు. ‘వికసిత్ భారత్’, ‘సబ్‌కా సాథ్ – సబ్‌కా వికాస్’ వంటి కేవలం నినాదాలతోనే దేశాభివృద్ధి సాధ్యం కాదని, ప్రతిపక్షాల, ప్రజల ఆకాంక్షలను వినాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు.

గతంలో రైతుల వ్యతిరేక సాగు చట్టాలు మరియు పరీక్షల లీకేజీ వ్యవస్థాగత లోపాల విషయంలో హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలను తొక్కిపెట్టాలని చూసిన సర్కార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడిన యువశక్తి దెబ్బకు తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇకనైనా తన ‘మన్ కీ బాత్’ పక్కనబెట్టి దేశ ప్రజల, యువత మాట వినాలని సూచించారు.

రాజకీయాల్లో యువతకు అవకాశాలు విస్తృతం చేసినప్పుడే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here