తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో చేసిన సరదా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం అగరం గ్రామంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా “మా ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయి. నేనొక పార్టీ కాగా, మా అబ్బాయి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ముగ్గురూ కలిసి వేరే పార్టీ” అని వ్యాఖ్యానించారు. తానేమో ‘కుప్పం పార్టీ’ అని, వారంతా ‘మంగళగిరి పార్టీ’ అని చమత్కరిస్తూ గ్రామస్థుల్లో ఉత్సాహం నింపారు.
కుప్పం అభివృద్ధికి ప్రాధాన్యం
కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి కుప్పం ప్రజల నిరంతర మద్దతే కారణమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. “ఆయనకు అధికారులు, సలహాదారులు ఉండవచ్చు, కానీ మీ ప్రేమ వాటన్నింటికంటే మిన్న. కుప్పం నియోజకవర్గానికి ఏం తెచ్చారో అని నేను ఆయనను అడుగుతూ ఉంటాను.
కుప్పం ప్రజల కోసం అవసరమైతే ముఖ్యమంత్రితో పోట్లాడి అయినా అభివృద్ధి పనులను, నిధులను సాధించుకొస్తాను” అని గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ఏపీని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు
కుప్పం పర్యటనలో భాగంగా భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో స్విమ్స్ (SVIMS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను, టీఎన్ఎస్ఎఫ్ (TNSF) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
అనంతరం పీఈఎస్ (PES) వైద్య కళాశాల విద్యార్థులతో సమావేశమై క్విజ్ పోటీలు నిర్వహించారు. టీటీడీ శ్రీవారి ట్రస్టు నిధులు రూ.34 కోట్లతో నియోజకవర్గంలోని 139 ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ట్రస్టు బోర్డు సభ్యులతో యామగానిపల్లె ధర్మరాజులస్వామి ఆలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు.








































