నటి త్రిషపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్‌కు టీవీకే ఫిర్యాదు

TVK Files Complaint With National Commission For Women Against DMK Leader Udhayanidhi Stalin

తమిళనాడు రాజకీయాల్లో సినీనటి త్రిష పేరు చుట్టూ ఒక్కసారిగా తీవ్ర దుమారం రేగింది. కావేరీ జలాల సమస్యపై తంజావూరులో డీఎంకే నిర్వహించిన రైతు నిరసన ర్యాలీలో ఆ పార్టీ కీలక నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సభలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేతను ఉద్దేశించి ఉదయనిధి మాట్లాడే సమయంలో, సభలోని డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా ‘త్రిష.. త్రిష..’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఉదయనిధి నవ్వుతూ ద్వందార్థ (డబుల్ మీనింగ్) డైలాగ్ మాట్లాడారనే విమర్శలు వెల్లువెత్తాయి.

జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

ఈ వ్యవహారంపై టీవీకే పార్టీ తీవ్రంగా మండిపడింది. రాజకీయాలో ఒక మహిళను, ఆమె వ్యక్తిగత జీవితాన్ని లాగి అసభ్యకరంగా వ్యాఖ్యానించడం దారుణమని ధ్వజమెత్తింది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ (NCW)కు టీవీకే అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు చేయాలని, ఆయన భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ నాయకులతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ఉదయనిధి తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

ద్వియార్థ వ్యాఖ్యలపై విమర్శల దాడి

మహిళల గౌరవాన్ని దిగజార్చేలా బహిరంగ వేదికలపై ప్రజాప్రతినిధులు ప్రవర్తించడం సరికాదని విమర్శకులు మండిపడుతున్నారు. నిరసన సభను చౌకబారు ప్రచారానికి వేదికగా మార్చుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వివాదం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారడంతో తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజుకుంది.

రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన పద్ధతి కాదని, నాయకులు తమ ప్రసంగాల్లో సంయమనం పాటించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here